Site icon vidhaatha

బీఆరెస్ అక్రమాలకు అద్దం పట్టిన కాగ్ నివేదిక


విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు ప్రజాధనం దుర్వినియోగానికి కాగ్ ఇచ్చిన నివేదిక అద్దం పట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా బీఆరెస్ పాలనలోని అవినీతి, కాళేశ్వరం అవినీతి, పాజెక్టులు, పథకాల మాటున సాగిన అవినీతిని కాగ్ తన నివేదికలో తేటతెల్లం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపి, ఖర్చులను తక్కువ చూపారని, కానీ వాస్తవంగా రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కాగ్ స్పష్టం చేసిందన్నారు.


కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే రీడిజైన్లతో అంచనాలు పెంచారన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు విస్మయకరంగా ఉన్నాయన్నారు. బైక్‌లు, కార్లు, అంబులెన్సులలో, ఆటోల్లో గొర్రెలను తరలించినట్లు కాగ్ నివేదిక పేర్కొందని, ఒకే ట్రిప్‌లో 126 గొర్రెలును బైక్ పై తరలించినట్లు, ఒకే ట్రిప్పులో 84 గొర్రెల రవాణాకు అంబులెన్సు వినియోగించినట్లు, 126 గొర్రెలను రవాణా చేయడానికి ఆటోను ఉపయోగించినట్లు ఇలా ఎన్నో విషయాలను కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గుర్తించారని వెల్లడించారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, డబుల్ ఇండ్లకు నిధుల మళ్లింపు, అసరా పించన్ల పంపిణీలో అవకతవకలు, దుబారా ఖర్చులు, స్థానిక సంస్థలు, రెవెన్యూ ఆదాయం వంటి అంశాలపై వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు కాగ్ నివేదిక బహిర్గతం చేసిందని పేర్కొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి సతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని, విచారణ కొనసాగుతోందని అన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంపై జ్యుడిపీయల్ విచారణ జరుపుతామని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు. కాగ్ రిపోర్టు ఆధారంగా బీఆరెస్‌ హయంలో జరిగిన వేలాది కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతామని, తప్పు చేసిన ఏ ఒక్కరి కూడా వదలబోమని స్పష్టం చేశారు.

Exit mobile version