Site icon vidhaatha

ఎన్నికల కోడ్‌తోనే పంట నష్ట పరిహారం ఇవ్వలేకపోతున్నాం


విధాత, హైదరాబాద్ : ఎంపీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మేము పంట నష్టం ఇవ్వలేకపోతున్నామని, ఈ విషయం తెలిసే కూడా బీఆరెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వ హాయంలో అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న సందర్భాల్లో ఇన్‌ఫుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పదేళ్లలో రైతులకు పంటల బీమా ప్రీమియంను చెల్లించలేదని, అటువంటి బీఆరెస్ మాజీ మంత్రులు ఇవ్వాళ కాంగ్రెస్‌పై బురదచల్లె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


పంట నష్టపరిహరంపై బీఆరెస్ నేతలతో చర్చకు తాను సిద్ధమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రైతులకు పంటల బీమా ప్రీమియం, పంట నష్టపరిహారం చెల్లించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఎండిపోయిన పంటలకు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లిస్తామని, ఇందుకు సంబంధించి దెబ్బతిన్న పంటల సర్వే జరుగుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియ్యగానే బాధిత రైతులకు పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎండిన పంటలనుసందర్శిస్తూ, కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ రాజకీయంగా లబ్ధి కోసం ప్రయత్నించడం తప్ప బీఆరెస్ మాజీ మంత్రులకు రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని జూపల్లి విమర్శించారు.

Exit mobile version