కేసీఆర్‌కు దిక్కులేక ఆరెఎస్పీ కాళ్లు పట్టుకున్నారు

బీఆరెస్ పార్టీ పాలనతో పోయిన రాష్ట్ర ప్రతిష్టతను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పునరుద్ధరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు

  • Publish Date - March 6, 2024 / 07:18 AM IST

  • బీజేపీలోకి హారీశ్‌రావు చూపు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • పోయిన రాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించాం
  • బీఆరెస్ హయాంలో రోజు కుంభకోణమే
  • మేం చేర్చుకుంటే ఆ పార్టీలో నలుగురే మిగులుతారు


విధాత: బీఆరెస్ పార్టీ పాలనతో పోయిన రాష్ట్ర ప్రతిష్టతను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పునరుద్ధరించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. బుధవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. కేటీఆర్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోవడం కాదని, బావ బామ్మర్ధులకు పడక పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్‌రావు బీజేపీలోకి పోతాడని జోస్యం చెప్పారు. బీజేపీతో ఇప్పటికే హరీశ్‌రావు సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు.


గడిచిన పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశాడని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్‌ వందేళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కునే శక్తి లేక అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. బీఆరెస్ వారిలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పోతే బీఆరెస్‌లో మిగిలేది నలుగురే మాత్రమే అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని మోదీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పారు. బీఆరెస్‌కు ఒక్క ఎంపీ సీటు రాదన్నారు.


బీఆరెస్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్‌కు దిక్కులేక చివరకు ఆరెస్‌. ప్రవీణ్‌ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కాకుండా యాదాద్రి దేవస్ధానం అభివృద్ధి పేరుతో కూడా కోట్ల రూపాయల అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. గత ప్రభుత్వం హయాంలో నిత్యం ఏదో ఒక కుంభకోణం జరిగేదని, బీఆరెస్ పాలకులు రాష్ట్ర వనరులను దోచుకున్నారని విమర్శించారు.


యువకులకు ఉద్యోగాలివ్వకుండా వారి జీవితాలతో బీఆరెస్ ప్రభుత్వం ఆడుకుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాకా 30వేల ఉద్యోగాలిచ్చామన్నారు. గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. బీఆరెస్ పాలనలో పదేళ్లలో 6వేల స్కూళ్లను మూసీవేశారన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో మార్పులు చేర్పులు ఉంటాయని, ఎవరికి ఇబ్బంది కల్గకుండా నిర్మాణం జరిపిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిలు పాల్గొన్నారు.

Latest News