Site icon vidhaatha

అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ


విధాత, హైదరాబాద్: అడవుల సంరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని (మార్చి 21) పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని తెలిపారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని మంత్రి తెలిపారు.


అడవులను సంరక్షించుకునే దిశగా ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తం ప్రతి ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మంత్రి సురేఖ తెలిపారు. ఈ సంవత్సరం ‘అడవులు, ఆవిష్కరణలు, మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు’ థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు.

Exit mobile version