KTR |
విధాత: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మోదీ ఒక బ్రోకర్.. అదానీకి ప్రధాని బ్రోకర్.. అని నేను అనలేనా? లోఫర్, లుచ్చా అనే మాటలు చదవలేనా? కానీ నాకు సంస్కారం ఉంది. దేశమంతా అంటున్నా నేను అనను’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ప్రధాని మోదీ దేశంలోని ఇతర పార్టీలను చంపాలని చూస్తున్నారని మండిపడ్డారు. దొంగపైసలతో ఎమ్మెల్యేలను కొనాలి.. పార్టీలను ఓడించాలి.. ఏక్‌నాథ్ షిండేలను తయారు చేయాలి..
దేశంలో ప్రతిపక్షాలు ఉండొద్దన్న లక్ష్యంతో ముందుకుపోతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను (BRS MLAs) కొనడానికి దొంగస్వాములను పంపిన బ్రోకర్, దళారి బీఎల్ సంతోష్ (BL Santosh) అని మండిపడ్డారు. గుజరాత్ (Gujarat) వాళ్ల చెప్పులు మోసే సన్నాసులు తెలంగాణ ( Telangana) లో ఉండటం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజన్ అంటే.. మోదీ, అదానీలేనని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో 120 ఏళ్ల పాటు విద్యుతుత్పత్తికి సరిపడే 360 బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని చెబుతున్న మోదీ ప్రభుత్వం.. విదేశీ బొగ్గు కొనాల్సిందేనంటూ పాలసీ తీసుకురావడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఇక్కడ టన్నుకు రూ.3వేలు ఉంటే.. పది రెట్లు ఎక్కువ రేటుతో బొగ్గు కొనడాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సైతం వ్యతిరేకించినా.. పట్టించుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు.