Site icon vidhaatha

Minister Niranjan Reddy | జర్నలిస్టులు.. స్వేచ్చగా పని చేయడం లేదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

Minister Niranjan Reddy | విధాత: జర్నలిస్టులు స్వేచ్చగా పని చేయడం లేదని, యజమాన్యాల కింద పని చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి యజమాన్యాలది వ్యాపారాత్మక ధోరణి అని, భవిష్యత్‌లో ఈ విధానం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు.

బషీర్ బాగ్ లో పునర్నిర్మించిన టీయూడబ్లూజే కార్యాలయం, సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంను బుధవారం మంత్రులు నిరంజన్‌రెడ్డి (Minister Niranjan Reddy), శ్రీనివాస్‌ గౌడ్ (Srinivas Goud)లు మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవుల పల్లి అమర్‌లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం నిజరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిజంలో రెండు పార్శ్వాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో అనేక భాషల్లో ఏర్పడిన పత్రికలు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాల్లో అక్కడి ప్రజా సమూహాల్లోని చైతన్యాన్నిపెంచడానికి ఒక కర్తవ్య దీక్ష తీసుకున్నారన్నారు.

ముందుచూపు కలిగిన వాళ్లు ప్రజలను నడిపించడానికి జర్నలిజాన్ని ఒక ఆయుధంగా వాడారని తెలిపారు. ‘‘రష్యా విప్లవంలో లెనిన్ ప్రారంభించిన పత్రిక, చైనా విప్లవంలో మావో ప్రారంభించిన పత్రిక, మనదేశంలో మహాత్మాగాంధీ ప్రారంభించిన పత్రిక గానీ, మహారాష్ట్రలో బాల్ థాకరే నడిపిన సామ్నా పత్రికగానీ వాటి లక్ష్యమే ప్రజలలో చైతన్యం, వ్యవస్థలో మార్పు, ప్రజలను ఒక దారిలో నడిపించడం’’ అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితులలో పత్రికల యాజమాన్యాలు ప్రజాచైతన్యం కోసం కట్టుబడి ఉన్నారనుకోవడం భ్రమేనని మంత్రి అన్నారు. నాడు ప్రజలను నడిపించడానికి రాత మొదలయిందని, తదనంతర కాలంలో ఘటనలు, సంఘటనలు, సమాజంలో జరిగే వివిధ రకాల కార్యకలాపాలు వాటిని ప్రజలకు తెలియపరిచే సాధనాలుగా మార్పు చెందాయన్నారు.

ఆ తర్వాత ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ప్రజాభిప్రాయాలుగా చూపే ప్రయత్నం నడుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్లిష్టమయిన పరిస్థితులలో జర్నలిస్ట్ ల యొక్క భవితవ్యం, వారి కర్తవ్య నిర్వహణ కత్తి మీద సాములాంటిదన్నారు. భావప్రకటనా స్వేచ్చకు, భావజాల వ్యాప్తికి ఉపయోగపడిన కేంద్రం జర్నలిజం అని అన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం

సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాత్రికేయుడుగా, పరిశోధకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, రచయితగా, న్యాయవాదిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యుడిగా ఇలా ఎన్నో పాత్రలు తక్కువ సమయంలో పోషించారని మంరి నిరంజన్‌రెడ్డి అన్నారు. అనేక రకాల దక్షతలను ఏకకాలంలో కలిగిన వ్యక్తి సురవరం.. అటువంటి వారు తెలుగునేలపై మరొకరు లేరన్నారు.

అలాంటి మహోన్నత వ్యక్తి 58 ఏళ్లకే మరణించడం దురదృష్టకరమన్నారు. సురవరం దృష్టికోణంపై రెండు సంకలనాలు తీసుకువచ్చాం.. మూడో సంకలనంలో మలిదశ తెలంగాణ ఉద్యమం, సాంఘీక, రాజకీయ చైతన్యాన్ని ఇందులో పొందుపరచడం జరిగిందన్నారు. సురవరం విద్వత్తు, తలపెట్టిన కార్యక్రమాలు తర్వాత తరానికి తెలిసేలా చేయడంలో అప్పటి వారు విఫలమయ్యారన్నారు.

12 మంది కవులు, సాహిత్యకారులతో కలిసి సురవరం సమాచారం సేకరించి సంకలనాలలో పొందుపరిచామన్నారు. భవిష్యత్ లో పీహెచ్ డీ చేసే వారికి ఇవి ఉపయోగపడతాయన్నారు. ఇనుపగుండెతో పనిచేసిన గొప్పమనిషి సురవరం అని అన్నారు.

ప్రాణమున్నంత వరకు కేసీఆర్‌ వెంటే.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

నా మీద ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాళ్ళకే రివర్స్ తగులుతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. నిజాయితీగల వ్యక్తులకు గ్యారెంటీగా న్యాయం జరుగుతుందనే దానికి తానే ఉదాహరణ అని చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పనిచేశారని, ఇప్పుడు ఎక్కడో ఉన్నారన్నారు. మేము మాత్రం ఆనాడు కేసీఆర్ వెంటే ఉన్నాం.. ఇప్పుడూ ఆయననే నమ్ముకొని ఉన్నామని తెలిపారు.

ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే మా పయనమన్నారు. అద్భుతమైన తెలంగాణ ఆవిష్కరిస్తామని చెప్పారు. జర్నలిస్ట్ లు , రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ విరాహత్ అలీ , సురవరం కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version