ఆ రెండు పార్టీలది ఒకటే రాగం: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుండే ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు

  • Publish Date - April 19, 2024 / 11:02 AM IST

రైతు సమస్యల పట్ల మొసలి కన్నీరు
బిజెపి పదేళ్ల పాలనలో తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయమే!

విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుండే ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని,ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక ఆందోళనకు అద్దం పడుతున్నాయన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు నిధుల సమీకరణ చేపట్టడం అంటే ప్రధాని మోదీ పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నారు. తాము బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న ఉత్తర భారత దేశంలో బిజెపి కోటలు బీటలు వారుతున్నాయని తెలిపారు.
అందుకే బిజెపి దక్షిణ భారతంపై దృష్టి సారించిందని, ఇక్కడ కొద్దో గొప్పో ఫలితాలు సాధించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిఘా నీడలో పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ నియంతృత్వ ప్రభుత్వం ఈసారి అధికారంలోకి రాకూడదని భావిస్తున్నారని తెలిపారు.

ప్రజల మధ్య వైషమ్యాలు తొలగిపోవాలని, వారంతా ఐక్యంగా ఉండాలంటే కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులు తప్ప గత పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల విడుదల జరగలేదన్నారు. విభజన హామీల అమలు, విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, పారిశ్రామిక అభివృద్ధితో పాటు అన్ని రంగాలలో కేంద్రం తెలంగాణకు అన్యాయమే చేసిందన్నారు.

ఒకే స్వరం వినిపిస్తున్నారు..

రైతుల సమస్యల గురించి మాట్లాడినా, ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్నా, రేవంత్ రెడ్డి బిజెపిలో కలుస్తారనే ప్రచారంలోనైనా బిజెపి, బీఆర్ఎస్ స్వరాలు ఒకటిగానే వినిపిస్తున్నాయని, రెండు పార్టీల నేతలు కూడ బలుక్కొని అన్నదమ్ముల్లాగా ఒకే మాట మాట్లాడుతున్నారని ప్రభాకర్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే బిజెపి మూడు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు వ్యతిరేకించినట్లు నటించి తిరిగి ఆ చట్టాలకు మద్దతు ప్రకటించలేదా అని ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇస్తా అన్నది.. వారి ఆదాయం రెండింతలు చేస్తా అన్నది.. ఆచరణలో మాత్రం మొండి చేయి చూపిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 22 పంటలకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే, బిజెపి ఒక పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించలేకపోయిందన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పదేళ్ల పాలన కాలంలో రైతుల సంక్షేమాన్ని విస్మరించి, ప్రస్తుతం రైతుల సమస్యల మీద మొసలి కన్నీరు కారుస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.

రుణమాఫీ చేస్తా…

శాసనసభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతాంగానికి ఆగస్టు 15 నుండి 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.వర్షాకాలం సీజన్ పంట నుండి వరికి 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు.

Latest News