Minister Ponnam | 14న బీజేపీ, బీఆరెస్ వైఫల్యాలపై నిరసన దీక్షలు

  • Publish Date - April 12, 2024 / 03:29 PM IST

తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదు
బీఆరెస్ పాలనలోనే కరవు
మంత్రి పొన్నం ప్రభాకర్

 

విధాత : కేంద్ర-రాష్ట్రాల్లో పదేళ్లు పాలించి ఇచ్చిన హామీల అమలు చేయని బీజేపీ, బీఆరెస్‌ల వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని పదేళ్ల బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసేందేమి లేదని, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, పార్లమెంటు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని పొన్నం మండిపడ్డారు.

తెలంగాణలోని ఏడు మండలాలను, విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రకు అప్పజెప్పిన బీజేపీ ప్రభుత్వం ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని ఇవ్వలేదన్నారు. మోదీ, అమిత్‌షాలు దేశానికి నవరత్నాలైన భారీ పరిశ్రమలను అమ్మేశారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేతగాక శ్రీరాముడి పేరున అక్షింతలు, కుంకుమలు పంచి ప్రజలను ఓట్లు అడుగుతు భావోద్వేగాలతో మత రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏమి చేసిండని, చేనేత కార్మికులకు అండగా ఉన్నది కేవలం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. తెలంగాణ ఏర్పాటును సైతం మోదీ వ్యతిరేకించారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, గత బీఆరెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పదేళ్లలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేయాలంటూ అడగడం విడ్డూరంగా ఉందని, 3016 నిరుద్యోగ భృతి ఏమైందో బీఆరెస్ నేత హరీష్ రావు చెప్పాలన్నారు. వర్షాకాలంలో రాష్ట్రంలో బీఆరెస్ అధికారంలో ఉందని, కాంగ్రెస్ ఎండకాలంలో అధికారంలోకి వచ్చిందని, కరవుకు బీఆరెస్ పాలన కారణమైతే, కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

బీఆరెస్‌ ప్రభుత్వంలో రైతులకు 2500 కూడా నష్ట పరిహారం ఇవ్వలేదని, అలాంటి బీఆరెస్ పాలకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో హామీల అమలు, రైతులకు పరిహారం వంటి సమస్యలు పెండింగ్‌లో పడిపోయాయని, కోడ్ ముగిశాక వాటిని అమలుచేస్తామన్నారు. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా 10మంది సీనియర్ అధికారులను నియమించామన్నారు.

Latest News