Site icon vidhaatha

వేములవాడలో పట్టు వస్త్రాల సమర్పణ వివాదం


విధాత: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించడంలో ప్రభుత్వ వైఖరి వివాదస్పదమైంది. సాంప్రదాయానికి భిన్నంగా కల్యాణోత్సవానికి ఒక రోజు ముందుగానే గురువారం ప్రభుత్వం తరుపునా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్ ఆదిమూల శ్రీనివాస్‌లు పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండటంతో వేముల వాడకు రాలేకపోయారని, తనకు హైదరాబాద్ లో సమావేశం ఉందని, అందుకే ఒక రోజు ముందుగానే పట్టువస్త్రాలు సమర్పించినట్లుగా మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ శ్రీనివాస్‌లు తెలిపారు.


ఎన్నికల కోడ్ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వారంలోగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని వారు వెల్లడించారు. అయితే తరతరాల ఆచారానికి భిన్నంగా ఒక రోజు ముందుగా స్వామివారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించడం సమంజసంగా లేదంటూ భక్తులు, కొంతమంది అర్చకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బాధ్యులైన ఆల‌య ఈవో, అధికారుల తీరుపై భ‌క్తులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. భద్రాచలంలో గతంలో మాజీ సీఎం కేసీఆర్ తన మనవడితో పట్టువస్త్రాలు పంపించడాన్ని వివాదం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేములవాడలో చేసిన అపచారానికి ఏం సమధానం చెబుతుందంటూ బీఆరెస్ వర్గాలు ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నాయి.

Exit mobile version