Minister Ponnam | కరీంనగర్ లోకసభ ప్రచారం ప్రారంభించిన పొన్నం

  • Publish Date - April 10, 2024 / 01:02 PM IST

ప్రతి బూత్ లోను మెజారిటీ ఓట్లు తీసుకురావాలి
బిజెపి, టిఆర్ఎస్ అభ్యర్థులు కరీంనగర్‌కు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి

విధాత బ్యూరో, కరీంనగర్: శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ పరిధిలోని నాలుగు స్థానాలు గెలిపించారు, ప్రస్తుత లోకసభ ఎన్నికల్లోను కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, మేమంతా కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తాం అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar). సోమవారం ఆయన సహచర శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

కరీంనగర్ నుండి జీవన్ రెడ్డి పోటీ చేస్తారని మొదట అనుకున్నా,ఆయన నిజామాబాద్ నుండి పోటీ చేస్తుండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం జరిగిందన్నారు. కాంగ్రెస్ నాయకత్వం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని కరీంనగర్ అభ్యర్థిని ఎంపిక చేస్తుందని చెప్పారు. అభ్యర్థి ప్రకటనతో సంబంధం లేకున్నా నియోజకవర్గంలో తాము ప్రచారం ప్రారంభిస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన అందించే దిశగా ముందుకు సాగుతోంది.. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.. వాటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలు వెళ్లి ఓట్లు అడగాలన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నలుగురు శాసనసభ్యులం కలసి ఐక్యంగా అభ్యర్థి గెలుపుకు పని చేస్తామన్నారు. పార్లమెంట్ పరిధిలోని 2500 బూత్ లలో ప్రతి బూత్ లో మెజారిటీ ఓట్లు తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.

 

నియోజకవర్గానికి చేసిందేమిటి?

బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో ఐదేళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని, ప్రస్తుతం బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఐదేళ్లుగా లోకసభ సభ్యుడిగా కొనసాగుతున్నారని, తమ పదవీకాలంలో వారు నియోజకవర్గ ప్రజలకు చేసిందేమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో తాము ఏమి చేసాము ప్రజలకు చెబుతామన్నారు. కొండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధికి వీరిద్దరూ చేసింది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

“అనేక యాగాలు చేశాను.. నేనే పెద్ద హిందువును.. ఈ హిందూ గాళ్లు బొందు గాళ్లు” అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గత లోక్ సభ ఎన్నికల సందర్భంలో బండి సంజయ్ గెలుపుకు దోహదపడ్డాయని చెప్పారు. రాముడి ఫోటోతో కాకుండా, నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని ఆయన బండి సంజయ్ కుమార్ కు సవాల్ విసిరారు.

ఆయనకు నాలుగవ స్థానమే!

బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ది ఈ జిల్లా కాదు.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవినో అడుక్కోకుండా ఇక్కడి నుండి పోటీ చేయడంలో ఉపయోగం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు దక్కేది 4 వ స్థానమే అని ప్రభాకర్ తెల్చి చెప్పారు.

అక్కడ మేము ఓట్లు అడగం..

గత ప్రభుత్వ పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన దగ్గర మేం ఓట్లు అడగం.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం.. రైతు బంధు ఇచ్చిన దగ్గర మేము ఓట్లు అడుగుతాం.. ఇవ్వని దగ్గర మీరు ఓట్లు అడుక్కోవాలని ఆయన బీఆర్ఎస్ అభ్యర్థికి సూచించారు. “మామాట..మీ అందరి మాట… ఒకటి కావాలి.. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని”పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తే, కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా పాలన వస్తుందన్నారు.

Latest News