- చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రజాప్రతినిధులు
జాతర (Jathara) అంటేనే సరదా.. సందడి జనంతో ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. తెలంగాణ (Telangana)లో జాతర వస్తుందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా హాజరై దేవునికి మొక్కులు సమర్పించడమే కాకుండా జాతరలో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఆనందంతో గడుపుతారు. చిన్నపిల్లలకైతే జాతర వచ్చిందంటే ఎక్కడా లేని సంబురం ఉంటుంది. బొమ్మలు(toys), చిలుకలు, బొంగు పేలాలు, బూర ఊదుతూ గోల గోల చేస్తారు. శనివారం మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ (Mahabubababad) ఎంపి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మానుకోట జిల్లా కురవి (Kuravi)జాతరలో సరదాగా గడిపి సందడి చేశారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆధునిక పరిణామాల నేపథ్యంలో కాస్తంత జాతరలకు ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవమే. అయినప్పటికీ భక్తి కారణంగా జాతరలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి (Veerabhadra swamy) ఆలయం చుట్టుపక్కల పెద్దఎత్తున జాతర సాగింది. వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు.
ఆలయంలో జరిగిన మహాశివరాత్రి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి (Minister)సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ గడిపారు. చిన్ననాటి సరదాలు తీర్చుకున్నట్లుగా జాతరలో కలియ తిరుగుతూ.. సరదాగా సందడి చేశారు.
కొద్దిసేపు మంత్రి, ఎంపీ అనే విషయం మరచి జాతరలో భాగస్వామ్యం అయ్యారు. ప్రజా ప్రతినిధులమనే విషయం మర్చిపోయి చిలుకలు, బొంగుపేలాలు కొనుగోలు చేస్తూ గాజులు(Bangles) వేసుకొని, బూర ఊదుతూ సరదాగా గడిపారు. వీరితోపాటు వచ్చిన అనుచరులు సిబ్బంది కూడా జాతరలో మమేకమై ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
కురవి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ (Dist Collector)శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, యువజన విభాగం అధ్యక్షులు యాళ్ళ మురళీధర్ రెడ్డి, కురవి జడ్పిటిసి బండి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.