Site icon vidhaatha

Jogulamba Temple: జోగులాంబ ఆల‌య పూజారి, ఈవోలపై విచారణకు మంత్రి సురేఖ ఆదేశాలు

Jogulamba Temple: జోగులాంబ ఆల‌య పూజారి ఆనంద్ శ‌ర్మ‌, ఈఓ పురేందర్ లపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ విచార‌ణ‌కు ఆదేశించారు. హైద‌రాబాద్‌లో మంత్రిని క‌లిసిన ఆలయ అర్చ‌కులు, స్వామిజీలు, విహెచ్‌పీ నేతల ఫిర్యాదుపై స్పందించిన మంత్రి సురేఖ విచారణకు ఆదేశాలిచ్చారు.

జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్ అవినీతి పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. హైద‌రాబాద్ బొగ్గుల‌కుంట‌లో జ‌రిగిన ఈ ఆందోళ‌న‌కు కొత్తకోట ఆశ్రమ అర్చకుడు శివానంద స్వామి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

శక్తిపీఠాలలో ఒక పీఠం అయిన అలంపూర్ జోగులాంబ ఆలయ పవిత్రతను కాపాడాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై క్రిమినల్ కేసులు వున్నందున..వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా ఆనంద్ శర్మ పై ఆరోపణలు వస్తున్నా.. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళనలో పాల్గొన్న వారు మండిపడ్డారు. ఆలయంలోని ఆభరణాల మాయం , పూజారి, ఈవోల అవినీతిపై ప్రభుత్వ సమగ్ర విచారణ జరిపితే..నిజాలు బయట పడతాయన్నారు.

ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి మినిస్ట‌ర్ క్వార్ట‌ర్స్ లో దేవ‌దాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ను క‌లిశారు. వెంట‌నే పూజారి ఆనంద్ శ‌ర్మ‌ను, ఈవోను విధుల నుంచి త‌ప్పించాల‌ని కోరారు. అర‌గంట‌పాటు అర్చ‌కులు, స్వామిజీలు చెప్పిన విష‌యాలు విన్న మంత్రి కొండా సురేఖ ఆల‌య ప్ర‌తిష్ట‌ను కాపాడ‌తామ‌ని హామీ ఇచ్చారు. ఆనంద్ శ‌ర్మ‌, ఈవోలపై విచార‌ణ‌కు ఆదేశించారు. త‌క్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాల‌ని క‌మిష‌న‌ర్‌ను ఆదేశించారు.

Exit mobile version