విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ హరితహోటల్‌కు వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao), సత్యవతిరాథోడ్ (Satyavathirathode)లకు ప్రజా సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. కేఎంసీ పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి (Preethi) ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు బుధవారం నిరసన తెలియజేశాయి. కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) లో పాల్గొనడానికి మంత్రులు బస చేశారని తెలిసిన ప్రజా సంఘాల నాయకులు హరిత హోటల్‌కు చేరుకుని నిరసన తెలిపారు.
- మంత్రికి కవిత మీద ఉన్న ప్రేమ ప్రీతి మీద లేదు
లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యమై ఈడీ కేసులో ఇరుక్కున్న కెసిఆర్ బిడ్డ కవిత మీద ఉన్న ప్రేమ మృతి చెందిన గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి పై గిరిజన మంత్రి సత్యవతికి లేదని విమర్శించారు. గిరిజన మంత్రిగా ఉన్న సత్యవతిరాథోడ్ మాట్లాడుతున్నారుగానీ.. గిరిజన బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే కనీస స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి
డాక్టర్ ప్రీతి (Preethi) మృతి సంఘటన నేపథ్యంలో ప్రజాసంఘాలు చేపట్టిన నిరసనపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ప్రతీరోజు ప్రీతి కుటుంబంతో మాట్లాడుతున్నామని, వారికి న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అయినా.. ప్రజాసంఘాలు ఇలా చేయడం తగదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, ఎల్ హెచ్ పి నాయకుడు కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.