విధాత: మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కరరావు మరోసారి నోరు జారారు. ఇటీవల నియోజక వర్గంలోని నర్సాపూర్‌లో అధికార పార్టీపై ఇష్టం లేకపోతే తామేసిన రోడ్లపై ప్రతిపక్షాల వారు నడవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాటిని జనం మరువక ముందే తాజాగా దళితబంధు యూనిట్ల పంపిణీలో స్థానిక ఎంపీపీ నూకల సరళ మాట్లాడుతూ.. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. వేదికపై ఉన్న భాస్కర్ రావు దీనిపై స్పందిస్తూ ఎవరు రాకున్నా ప్రోగ్రాం ఆగదని, స్థానిక ప్రజాప్రతినిదులే ముందుగా వచ్చి అన్ని చూసుకోవాలని, అధికారులకు చెప్పాలని, వారిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
అన్ని పనులు సారే చేయాలంటే ఎట్లా.. చాకలి పని, మంగళి పని అన్ని పనులు నేనే చేయాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. భాస్కర్ రావు ఉద్దేశపూర్వకంగా అనకపోయినప్పటికీ కులవృత్తుల సామెతలను ఉదహరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ వర్గాలపై ఆయనకున్న చిన్న చూపును చాటుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే మహిళా ఎంపీపీ పట్ల ఆయన సభలో అగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా విమర్శల పాలవుతుంది. నెమ్మదస్తుడిగా కనిపించే భాస్కరరావు ఇటీవల తరచూ ప్రజా కార్యక్రమాల్లో సహనం కోల్పోతూ నోరు జారుతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
పార్టీలో పెరుగుతున్న అసమ్మతి, ప్రతిపక్షాల నుండి ఎదురవుతున్నారు రాజకీయ సవాళ్లు, తన సీటుకే ఎసరు పెట్టేలా ఉన్నా మిత్రపక్షం సీపీఎం పొత్తుల కత్తులు, వెరసి వాటన్నింటి మధ్య నలిగిపోతున్న భాస్కరరావు అసహనానికి గురవుతున్నట్లుగా భావిస్తున్నారు.
మరో వైపు ఎమ్మెల్యే భాస్కరరావు కుల వృత్తుల వారిని అవహేళన చేసేలా మాట్లాడడంపై జిల్లా బీసీ సంఘాలు , ఎంపీటీసీల ఫోరం తీవ్రంగా ఖండిస్తూ భాస్కరరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.