Site icon vidhaatha

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం


విధాత, హైదరాబాద్‌ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు మండిడ్డారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియా పాయింట్‌కు వెళ్తున్న బీఆరెస్‌ ఎమ్మెల్యేల‌ను పోలీసులు, మార్ష‌ల్స్ క‌లిసి అడ్డుకోవడంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలకులు చెప్పిన ప్రజాపాలన అంటే ఇదేనా అని నిల‌దీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళుతున్న బీఆరెస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్ర‌శ్నించారు.


అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు అని మండిప‌డ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం.. అంటూ బీఆరెస్‌ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

తెలంగాణ భాషను అవమానిస్తున్న రేవంత్‌రెడ్డి : పల్లా


సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాష గా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భాషను సీఎం రేవంత్ రెడ్డి అవమానపరుస్తున్నారన్నారు. రెండు నెలలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని ఆరోపించారు. అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారని, తమ గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం నొక్కుతోందన్నారు.


దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం ఎక్కడా ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్‌గాంధీకి, తెలంగాణకు ఏం సంబంధం అన్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కోరారు.

Exit mobile version