MLA Harish Rao | రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆరెస్‌ ప్రభుత్వమే

  • Publish Date - April 12, 2024 / 03:52 PM IST

  • నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత

  • బీఆరెస్ వ్యతిరేకంగా ఒక్కటైన బడేమియా..చోటే మియా

  • మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

 

విధాత: రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది బీఆరెస్ ప్రభుత్వమేనని, మనం పదేళ్లు పాలించిన రాని వ్యతిరేకత నాలుగు నెలలు కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు జోస్యం చెప్పారు. శుక్రవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ పాలకులు గంభీర ఉపన్యాసాలు ఇచ్చారని, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు.. పని లేదని, కేసులు..లీక్‌లు మాత్రమే ఉన్నాయన్నారు.

ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చిందని, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతదని హెచ్చరించారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని, మన సిలేరు విద్యుత్తు ఫ్లాంటును, ఏడు మండలాలను లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అని హరీశ్‌రావు విమర్శించారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణ చేసిన ఒక్క మంచి పని లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌, బిజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురజ చల్లిండని, ఇప్పుడు ప్రధాని మోదీని బడే మియా అంటుండనిఎద్దేవా చేశారు.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను ఓడించి పార్టీని లేకుండా చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ బడేమియా చోటేమియాలు కుమ్మక్కయి కుట్ర పన్నుతున్నరని ఆరోపించారు. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేలా సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు పని చేయాలని, బీజేపీని ఓడించే శక్తి బీఆరెస్‌కే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలన్నారు. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆరెస్ గెలవాలన్నారు.

సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ కు తరలించుకు పోయి, సిద్దిపేటలో వివిధ అభివృద్ధి పనులు, రోడ్లు కు 150 కోట్లు రద్దు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ది చెప్పాలంటే మెదక్‌లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలన్నారు. ఇంటికి రెండెడ్లు, నిరుద్యోగ భృతి ఇస్తానని, రైలు తెస్తానని అబద్ధాలు చెప్పి ఉప ఎన్నికల్లో గెలిచిన దుబ్బాక చెల్లని రూపాయి బీజేపీ నేత రఘునందన్‌రావుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. సిద్ధిపేట ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ గెలుపు కోసం సహకరించి తమ ప్రత్యేకతను చాటుకోవాలన్నారు.

Latest News