పాత ఆకులు రాలిపోతాయి.. కొత్త చిగుర్లు వస్తాయి: హరీశ్‌రావు

బీఆరెస్‌లో పదవులు, అధికారం అనుభవించి ఆర్ధికంగానూ లాభపడిన బడా నేతలే పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ వీడటం పట్ల మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు

  • Publish Date - March 29, 2024 / 12:23 PM IST

  • వలసలపై మాజీ మంత్రి టీ.హరీశ్‌రావు వ్యాఖ్యలు
  • పవర్ బ్రోకర్లు..అవకాశవాదులే మారుతున్నారు
  • ఉద్యమకారులు..కార్యకర్తలు మారడం లేదు


విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌లో పదవులు, అధికారం అనుభవించి ఆర్ధికంగానూ లాభపడిన బడా నేతలే పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ వీడటం పట్ల మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ నుంచి వరుసగా సాగుతున్న వలసలను ఆకులు రాలేకాలంతో పోల్చుతూ పార్టీలో నుంచి కొన్ని ప‌నికిరాని ఆకులు చెత్త‌కుప్ప‌లో క‌లిసిపోతున్నాయని, పాత ఆకులు పోయాక మ‌ళ్లీ కొత్త చిగురు వ‌చ్చి ఆ చెట్టు విక‌సిస్తుందని, కొన్ని ఆకులు పోయిన‌ట్టు కొంత‌మంది నాయ‌కులు పోవ‌చ్చని వ్యాఖ్యానించారు.


దుబ్బాక‌లో ఏర్పాటు చేసిన మెద‌క్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. ప‌వ‌ర్ బ్రోక‌ర్లు, అవ‌కాశ‌వాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నార‌ని, అలాంటి వారంతా ప‌నికిరాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నార‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. ఇవాళ మ‌న పార్టీ నుంచి కొంత‌మంది నాయ‌కులు బ‌య‌ట‌కు పోతున్నారని ఉద్యమకారులు.. కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ వెళ్ల‌డం లేదన్నారు. ఎవ‌రైతే మ‌ధ్య‌లో మ‌న పార్టీలోకి వ‌చ్చారో.. ప‌వ‌ర్ బ్రోక‌ర్లు, అవ‌కాశవాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు.


ఇప్పుడు ఎవ‌రైతే పార్టీ నుంచి పోయారో.. రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేద‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌దని స్పష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే ప‌రిస్థితి లేదని, క‌ష్ట‌కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే క‌న్న‌త‌ల్లికి ద్రోహం చేసిన‌ట్టేనన్నారు. వలస నాయకుల తీరు అన్యాయం కాదా..? ఏం త‌క్కువ చేసింది పార్టీ వారికి.. అన్ని అవ‌కాశాలు ఇచ్చిందన్నారు. పార్టీకి అండ‌గా నిల‌బ‌డ్డ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను గుండెల్లో పెట్టుకుంటాం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.


ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో ప‌ట్టున ప‌ది మంది లేకున్నా.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి.. రానే రాదు కానే కాదు అన్న తెలంగాణ తెచ్చి పెట్టిండని, తెలంగాణ వ‌స్త‌దంటే ఆ రోజు ఎవ‌రూ న‌మ్మలేదని, కానీ కేసీఆర్ తెలంగాణను తెచ్చిపెట్టిండు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత‌కాలం బీఆరెస్‌ పార్టీ ఉంట‌దన్నారు. బీఆరెస్‌ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల కోసం, ఈ ప్రాంతం కోసం ప‌ని చేసే పార్టీ అన్నారు.


అస‌లు సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా..? ఉద్య‌మంలో జై తెలంగాణ అన‌లేదని, ఇప్పుడు కూడా అన‌డం లేదని, కనీసం ఏనాడైనా అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద రెండు పూలు పెట్ట‌లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదని, తెలంగాణ కోసం పోరాడింది మ‌నమని స్పష్టం చేశారు. రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకు వారు దుష్ర్ప‌చారం చేస్తున్నారని, దుబ్బాక బీఆర్ఎస్ అడ్డా.. మెద‌క్ ఎంపీ స్థానంలో ఇప్పుడు కూడా బీఆరెస్ గెలవబోతుందన్నారు.

Latest News