బీఆరెస్‌ పోరాటంతోనే కృష్ణా జలాలపై కాంగ్రెస్ తీర్మానం

బీఆరెస్‌ పోరాటంతో...నల్లగొండలో బీఆరెస్ తలపెట్టిన సభతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం చేసిందని, కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు

  • Publish Date - February 12, 2024 / 11:25 AM IST

  • కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉంది
  • అందుకే ప్రాజెక్టులను అప్పగించారు
  • మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

విధాత : బీఆరెస్‌ పోరాటంతో…నల్లగొండలో బీఆరెస్ తలపెట్టిన సభతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం చేసిందని, కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం బీఆరెస్‌ తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు.


ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉందని అందుకే కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు సిద్ధపడిందన్నారు. కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయామన్నారు. జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి మాపై ఎదురు దాడి చేయడం దురదృష్టకరమన్నారు.


సాగర్ ప్రాజెక్టుపై వివాదం చోటుచేసుకున్నా ఇప్పటిదాకా సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే మేమే తరిమామని అన్నారు. కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు. బీఆరెస్‌ ప్రభుత్వం హయాంలో కృష్ణానదీ ప్రాజెక్టులు మా కంట్రోల్ లోనే ఉన్నాయనీ పేర్కొన్నారు. కృష్ణా జాలల హక్కులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం ఒప్పుకున్నా… అప్పటి బీఆరెస్‌ సర్కార్ ఒప్పుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఏపీ నేతలకు ఏజెంట్‌లుగా మారారని ఫైర్ అయ్యారు.


కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మారారని పేర్కొన్నారు. కృష్ణ జలాల హక్కు విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు మాపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరం అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఏపీ నేతలకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఏజెంట్లుగా మారారన్నారు. రేపటి సభ కు ఉమ్మడి నల్గొండ ,ఖమ్మం,మహబూభ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు భారీగా హాజరవుతారన్నారు. కేసీఆర్ సభ కోసం కృష్ణా పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.


సభకు లక్షలాదిగా తరలిరావడం కోసం స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాధరి కిషోర్ కుమార్, జీవన్ రెడ్డి, రవీంద్ర కుమార్ , చిరుమర్తి లింగయ్య తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో కలసి జగదీష్ రెడ్డి పరిశీలించారు.

Latest News