Site icon vidhaatha

కేసీఆర్ గుర్తులైన సంక్షేమ పథకాలను మాయం చేస్తున్నాడు

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపిస్తామని ఆయన గుర్తులైన సంక్షేమ పథకాలను మాయం చేస్తున్నాడని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్నివ్యతిరేకిస్తూ ఈనెల 13న నల్గొండలో తలపెట్టిన కేసీఆర్ నల్లగొండ బహిరంగ సభ ఏర్పాట్లను జగదీశ్‌రెడ్డి, జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ గుర్తులు చెరిపేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి నీచ సంస్కృతి అర్థం అవుతుందని, నిజంగానే కేసీఆర్ గుర్తులు ఇవాళ మాయం అవుతున్నాయన్నారు.


కేసీఆర్ గుర్తు 24 గంటల కరంట్ ఇవ్వాళ మాయమైందని, కేసీఆర్ గుర్తు రైతు బంధు డబ్బులు ఇవ్వాళ మాయం చేశారన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెసోళ్లు చెప్పుతో కొడతాం అంటున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ గుర్తు నిరంతర మంచి నీటి సరఫరా పథకం చెదిరిపోయి ఇవ్వాళ నీళ్లు రావడం లేదన్నారు. ఇలాంటి దొంగల చేతికి ఇవ్వాళ తెలంగాణ పోయిందని, అదే తెలంగాణ దౌర్భాగ్యమన్నారు. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తేకపోతే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనియ్యమన్నారు. ఈ నెల 13న కేసీఆర్ సభను నల్గొండ దద్దరిల్లేలా నిర్వహిస్తామన్నారు.


కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని కేసీఆర్ స్వయంగా ప్రజలకు వివరిస్తారన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ను, బీఆరెస్ నేతలను కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, సభ సమన్వయకర్తలు రవీందర్ సింగ్, డాక్టర్ చెరుకు సుధాకర్‌, పల్లె రవికుమార్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, తండు సైదులు గౌడ్‌, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version