Site icon vidhaatha

MLA Sithakka | పల్లె పల్లెకు కాంగ్రెస్ గడప గడపకు సీతక్క

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పల్లె పల్లెకు కాంగ్రెస్, ఇంటింటికీ సీతక్క కార్యక్రమాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Sithakka) ప్రారంభించారు. ములుగు నియోజకవర్గంలోని కొత్త గూడ మండలం గుంజేడు ముసలమ్మను శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని సీతక్క ప్రారంభించారు. గుంజేడు, కొత్తగూడ, కొత్త పెల్లి, గ్రామాలలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.

కేసీఆర్ పాలనలో ఒరిగిందేమీ లేదు

గత తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదని ప్రజా వ్యతిరేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండ కట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె వివరించారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని సీతక్క కోరారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చూశారని, ప్ర‌స్తుతం పనికిరాని ఆంక్షలతో రైతులపై బీఆర్ఎస్ భారం మోపుతోందన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. లక్షల ఇందిరమ్మ ఇళ్లు, వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశామని, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చామని, ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని సీతక్క అన్నారు. అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు ఇస్తామని, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు చల్ల నారాయణ రెడ్డి, పైడాకుల అశోక్, మల్లాడి రాం రెడ్డి, జెడ్పీటీసీ లు పులసం పుష్పలత శ్రీనివాస్, ఈసం రమ సురేష్, బానోత్ విజయ రూపు సింగ్,సువర్ణ పాక సరోజన, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version