- మీ పాపాల చిట్టా విప్పుతా
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
MLA Vemula Veeresham | విధాత : శాసనసభ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపక్ష బీఆరెస్ సభ్యులపై మండిపడ్డారు. తన ప్రసంగానికి అడ్డుతగిలిన బీఆరెస్ సభ్యులను ఉద్ధేశించి నన్ను గెలగొద్దు.. గెలికించుకోవద్దని, మీ దగ్గర నుంచే కాంగ్రెస్ లోకి వచ్చానని, మీ పాపాల చిట్టా విప్పుతానని హెచ్చరించారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు నియంత పాలన కొనసాగిందని కాంగ్రెస్ గెలుపుతో స్చేచ్చాయుత తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజునే ప్రగతి భవన్ బారికేడ్ల తొలగించి స్వతంత్ర తెలంగాణకు అంకురార్పణ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లకు ప్రజాస్వామ్య తెలంగాణ ఆవిష్కృతమైందని చెప్పారు. దళిత జాతిని ఘోరంగా అవమానించిన చరిత్ర బీఆరెస్ పార్టీదని, స్వరాష్ట్రం ఏర్పడితే దళితున్ని సీఎం చేస్తానని చెప్పి విస్మరించారని దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి చేసి అకారణంగా పదవి నుండి తొలగించి దళిత జాతికి తీరని ద్రోహం చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డ విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించి సముచిత గౌరవం కల్పించామన్నారు.
బీఆరెస్ దళితులకు ద్రోహం చేసినందునే ఆజాతి కాంగ్రెస్ పక్షాన నిలచి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిందన్నారు.ఇప్పటికైనా బీఆరెస్ నేతలు అహంకారాన్ని తగ్గించుకొని వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. బీఆరెస్ పార్టీ నిజంగా సంక్షేమ పాలన చేస్తే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలలో ఒకటి రెండు స్థానాలకే ఎందుకు పరిమితమైందో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. హామీలు అమలు చేసేంత వరకు ఓపిక ఉండాలని, మరో రెండు గ్యారంటీ లు త్వరలో అమలు చేస్తామని, బీఆరెస్ నాయకులు మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
బీఆరెస్ చేసిన ఒక్కో అవినీతి బయటపడుతుంటే.. ప్రజలు విస్తుపోతున్నారన్నారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో నా నియోజకవర్గానికి మూసీ మురికి నీళ్ళు తప్ప.. సుక్క నీళ్ళు ఇవ్వలేదన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, దక్షిణ తెలంగాణ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. మొన్నటి ఎన్నికల్లో అందుకే ఓటమి చెందారని, ప్రజలు వీళ్ళను నమ్మలేదు అనడానికి ఎన్నికల తీర్పే నిదర్శనమన్నారు. విద్య,వైద్య రంగాలను ధ్వంసం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకులను విస్మరించారని, గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారులకు ఘోరంగా అవమానాలు చేశారన్నారు. ప్రగతి భవన్ వద్ద ఎర్రటి ఎండలో మూడు గంటల పాటు నిరీక్షించినా కేసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు.
గద్దర్ జయంతిని తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందన్నారు. ఒక్క గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనం లేదని, ఇంత దుర్మార్గం చేసినా ప్రజలు ఏం అనుకుంటారు అనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సహా ప్రభుత్వ యూనివర్సిటీ అన్నింటిని ధ్వంసం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేశారన్నారు. ఆ యూనివర్సిటీలు ఎవరికి దక్కయో ఆలోచించుకోవాలని, ప్రజల కోసం నిర్మించిన ప్రజా భవనంలోకి గతంలో ప్రజలకు అనుమతి లేదన్నారు. దళిత ఎమ్మెల్యేలను బీఆరెస్ నాయకత్వం కనీసం మనిషిగా చూడలేదన్నారు. సీఎం రేవంత్ పై బీఆరెస్ నేతలు వాడే భాష మార్చుకోవాలన్నారు.