- ట్యాపింగ్‌పై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా
- కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం సవాల్
- ట్యాపింగ్‌తో బ్లాక్ మెయిల్ చేసి వందలకోట్లు దండుకున్నారు
విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందేనని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాకా కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ట్యాపింగ్‌లో మీ ప్రమేయం లేకపోతే లై డిటెక్టర్ టెస్టుకు వస్తారా..? అని కేసీఆర్, కేటిఆర్‌లకు యెన్నం సవాల్ చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే కవిత తీహార్ జైలుకు వెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో క్యాంపులు వేశాడని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మొత్తం తీహార్ జైలుకు వెళ్లి కవితకు కంపనీ ఇవ్వాల్సిందేనన్నారు. ట్యాపింగ్‌తో బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కోసం నవీన్ రావు, శ్రవణ్ రావులు సర్వర్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేశారని యెన్నం తెలిపారు.
అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్‌తో బాధిత వ్యక్తులను బెదిరించి వందలకోట్లు కోట్లు దండుకున్నారని పేర్కోన్నారు. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రాధ పేరుపై బదలాయించారని తెలిపారు. ట్యాపింగ్‌పై సిట్ వేసి మరింత లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాలనలో ప్రయివేట్ ట్యాపింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.
నిఘా వ్యవస్థను పూర్తిగా బీఆరెస్ పాలకులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి కేటీఆర్‌కు లేవన్నారు. అన్ని బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబెర్స్ పోటీ చేయడం కాదన, ఇప్పుడు ఎందుకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ముగ్గురు కుటుంబ సభ్యులకు ప్రజాదరణ ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు ముగ్గురు మూడు చోట్ల పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా మంది భాదితులు ఉన్నారని, తాను డీజీపీ కి పిర్యాదు చేసినట్లు.. అందరూ పిర్యాదు చేయాలని కోరారు. ప్రతీ జిల్లా లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. రాష్ట్రం ఇన్నాళ్లుగా బీఆరెస్ చేసిన ఆగడలు తెలిసి కూడా.. కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా బీజేపీ, బీఆరెస్ వ్యవహరించాయని యెన్నం విమర్శించారు.