Site icon vidhaatha

MLC bye election | మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్‌

MLC bye election : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్నది. ఇవాళ (గురువారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నిక కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు.


ఈ ఉపఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం ఆయన కొడంగల్‌ ఎంపీడీవో కార్యాలయానికి రానున్నారు. నాగర్‌ కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్‌రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఓటు వేశారు. ఏప్రిల్‌ 2న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.


ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌ కుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు. సుదర్శన్‌గౌడ్‌ అనే అభ్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

Exit mobile version