- అవినీతి బయటపడకుండా మోదీతో దోస్తీ
- కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ
- అనుమతుల్లేని ప్రాజెక్టులకు అప్పులిచ్చారు
- విభజన హామీలపై కేసీఆర్ విఫలం
- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ముందు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో మోకరిల్లింది అయ్యా కొడుకులేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పుల్లలు పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మెదీకి తాకట్టు పెట్టింది కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణకు ఏం కావాలని ప్రధాని అడిగితే… హామే కు కుచ్ నహీ చాహియే.. అంటూ.. తన కొడుకును సీఎం చేయడానికి ఆశీర్వాదం కావాలని కోరారని, ఈ విషయాన్ని మోదీయే చెప్పారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆత్మగౌరవం ఏమైందని నిలదీశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉన్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
విభజన చట్టంలోని హామీలను తేవడంలో కేసీఆర్ విఫలం
విభజన చట్టంలోని హామీలను కేసీఆర్ తేవడంలో విఫలం అయ్యారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడేవాళ్ళు కూడా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి బ్రాండ్ అంబాసిడర్ మా రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఎవరెవరు ఒక్కటైనా రేవంత్‌రెడ్డిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని, ఆమె అత్యంత ప్రతిష్ఠాత్మక పోర్ట్‌ఫోలియో నిర్వహిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి వాటా ఉందని ఆరోపించారు.
కేసీఆర్ అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అని జీవన్‌రెడ్డి చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు కేంద్రం అప్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను కేసీఆర్ తన మిత్రుడు జగన్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆరే, వాటికి ఆటంకాలు తెచ్చిందీ కేసీఆరేనని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కలను రేవంత్ తీరుస్తున్నారని తెలిపారు. వైట్ రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లకు మించినా ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు.