Site icon vidhaatha

MLC Kavitha | టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించాల్సిందే


MLC Kavitha | విధాత : టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించాల్సిందేనని, ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై న్యాయ విచారణ జరిపించాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీఆరెస్ ప్రభుత్వ హాయంలో డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి విమర్శించారనిగుర్తు చేశారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమిస్తారని, తద్వారా తెలంగాణ యువతకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ నేపధ్యం ఉన్నవారిని తాము కమిషన్‌లో నియమించబోమంటూ చెప్పిన రేవంత్‌రెడ్డి పాల్వాయి రజనిని ఎలా నియమించారంటూ ప్రశ్నించారు.


సీఎం రేవంత్‌రెడ్డిలో పచ్చ రక్తం ప్రవహిస్తుందన్నారు. జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి రాష్ట్ర గీతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారని, నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా? అని నాలా ఉంటే తప్పేంటంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, హైదరాబాద్లో 3-4 గంటలపాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయన్నారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్లుగా నియమించారని, తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకని, గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్ ఇప్పుడెలా నియమిస్తున్నారని ? ఇదంతా రాజకీయ పునరావాసం కోసమే కదా?” అని కవిత ప్రశ్నించారు.


రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు వాదించిన లాయర్లను సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా నియ‌మించారని, ఇదేం పద్దతి? ఇదేం న్యాయం? అని నిలదీశారు. మొన్న‌టి వ‌ర‌కు రేవంత్ రెడ్డి జేబులో నుండి జీతం ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును ఇస్తున్నారని, ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా? కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఈ అంశంపై సీఎంను ఎందుకు నిలదీయడం లేదన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని, అధికారంలోకి వ‌చ్చాక అయినా సీఎం రేవంత్‌రెడ్డి నిజాలు చెప్పాలని, బీఆరెస్ ప్రభుత్వంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాల‌ను తామేదో ఇచ్చిన‌ట్లు చెప్పుకోవ‌టం ఎందుకు? అని నిలదీశారు.

Exit mobile version