- బీఆరెస్ కు ఓటేస్తే మోదీకి వేసినట్టే..
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొడంగల్, తాండూరు, వికారాబాద్..
- పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటన
విధాత: బీఆరెస్, ఎంఐఎం కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ముగ్గురూ తోడు దొంగలే అని విమర్శించారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలం అవుతోందని బీఆర్ఎస్ పార్టీ పై సెటైర్ వేశారు. గురువారం కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరసన తెలిపే స్వేచ్ఛ లేదు… మేం అలా చేసి ఉంటే బీఆరెస్ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లాలో భూములను వేల కోట్లకు కేసీఆర్ తెగనమ్ముకున్నారని ఆరోపించారు. ఫార్మా సెజ్ పేరుతో 40 వేల ఎకరాలు గుంజుకున్నారని, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ‘తెలంగాణ సంపదను కేసీఆర్ కొల్లగొట్టారు. చార్లెస్ శోభారాజ్, దావూద్ కంటే ఎక్కువ దోపిడీకి పాల్పడుతున్నారు. కేటుగాళ్లకే కేటుగాడిగా దోచుకుంటున్నారు’ అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దాడులు చేయడం మా విధానం కాదు.. అభివృద్ధి చేయడమే మా విధానం అని అన్నారు.
దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
పేదల జీవన ప్రమాణాలు పెంచుతాం..
“పేదల జీవన ప్రమాణాలు పెంచి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే మా విధానం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్, ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు సాయం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకోవడం మా విధానం” అన్నారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటే కొడంగల్ కు ఏం జరిగింది? అని ప్రశ్నించారు. రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి కాళ్లు కడుగుతామన్న కేసీఆర్…ఐదేళ్లయినా ఎందుకు తీసుకురాలేదు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా కొడంగల్ కు నీళ్లు రావు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని బీఆరెస్ భావిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. “కొడంగల్ లో కట్టిన గుడి, బడి అన్నీ నా హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే.
కొడంగల్ కు తాగునీరు తెచ్చి దాహార్తిని తీర్చింది నేను కాదా? కొడంగల్ నియోజకవర్గానికి 30 సబ్ స్టేషన్లు తెచ్చింది మేము..కొడంగల్ ప్రజలకు బస్ డిపో తెచ్చింది మేము…నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి మా హయాంలోనే జరిగింది. బీఆరెస్ హయాంలో నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి అన్యాయం చేశారు.. నేను చేసిన పనులకు శిలాఫలకాలు వేయడం తప్ప బీఆరెస్ చేసిందేం లేదు. జిల్లాలు పెంచి కొడంగల్ ను ముక్కలు చెక్కలు చేశారు” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తాండూరుకు ఒరిగిందేంటి?
“నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఇప్పుడు అతని కడుపులో తలంపెట్టిండు. ఇవాళ మంత్రి పదవి ఇచ్చిండు.. నిన్నటి వరకు జుట్లు జుట్లు పట్టుకున్నోళ్లు ఇవాళ పదవులు పంచుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ మూడు రంగుల జెండాకు ఉన్న పవర్ వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి తప్ప.. తాండూరుకు ఒరిగిందేంటి ” అని రేవంత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను ఎద్దేవా చేశారు.
ముదిరాజులపై పగబట్టారు..
బీసీ మంత్రి ఈటల రాజీనామా చేస్తే.. ఆ పదవిని బీసీకి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారో ఆలోచించండన్నారు రేవంత్ రెడ్డి. ‘రాష్ట్రంలో 115 సీట్లలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదు. ముదిరాజులపై కేసీఆర్ పగబట్టారు. 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు.. అర శాతం ఉన్న కేసీఆర్ వర్గానికి 4 మంత్రి పదవులా? ఇచ్చారు’ అని ఆయన విమర్శించారు. ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు తెలంగాణలో సామాజిక న్యాయం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.“రాజేందర్ కు, కేసీఆర్ కు పంచాయితీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఆయనపై కోపాన్ని కేసీఆర్ ముదిరాజ్ బిడ్డలపై చూపడం సరైంది కాదు. ఏబీసీడీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతానని కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు వర్గీకరణపై కేసీఆర్ మోదీని నిలదీయలేదు. ముదిరాజులకు, మాదిగ బిడ్డలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్ కు ఓట్లు ఎందుకు వేయాలి.
వర్గీకరణకు సహకరించని కేసీఆర్ కు మాదిగ బిడ్డలు ఎందుకు ఓటు వేయాలి? మన పిల్లలు బర్లు, గొర్లు పెంచుకోవాలట… వాళ్ల పిల్లలు రాజ్యాలు ఎలుతారట. నీళ్లు జగన్ రెడ్డికి, నిధులు మేఘా కృష్ణారెడ్డికి, నియామకాలు కేసీఆర్ కు వెళ్లాయి” అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
చేవెళ్ల సభ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్లతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉంది. చేవెళ్ల నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది విజయవంతం అవుతుందన్నారు. ఖమ్మం సభ స్థాయిలో చేవెళ్ల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.