త్వరలో CM KCRతో భేటీ అవుతా: MP కోమటిరెడ్డి

PM మోడీతో అభివృద్ధి ప‌నుల‌పైనే చ‌ర్చ విధాత: ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ప్రధానితో అర గంట భేటీ అనంతరం వెంకట్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తన పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై ప్రధాని మోడీతో చర్చించినట్లు తెలిపారు. మూసీ నదిని గంగా నది తరహాలో ప్రక్షాళన చేయాలని, విజయవాడ- హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు […]

  • Publish Date - December 16, 2022 / 09:17 AM IST

PM మోడీతో అభివృద్ధి ప‌నుల‌పైనే చ‌ర్చ

విధాత: ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ప్రధానితో అర గంట భేటీ అనంతరం వెంకట్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తన పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై ప్రధాని మోడీతో చర్చించినట్లు తెలిపారు.

మూసీ నదిని గంగా నది తరహాలో ప్రక్షాళన చేయాలని, విజయవాడ- హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు విస్తరించాలని మోడీని కోరినట్లు గా చెప్పారు. అలాగే ఎంఎంటీఎస్ రైలును యాదాద్రి, జనగామ వరకు పొడిగించాలని, భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని, భువనగిరి కోటపై రోప్ వే ఏర్పాటు చేయాలని మోదీని కోరినట్లు కోమ‌టిరెడ్డి తెలిపారు.

ఆయా పనులకు సంబంధించిన వివరాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి అందించానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాను కోరిన ఆయా పనుల విషయమై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అధ్యయనం కోసం ముందుగా ఒక కమిటీ వేసేందుకు ప్రధాని సుముఖత తెలిపినట్లు తెలిపారు.

అయితే ఈ భేటీలో రాజకీయ అంశాలు, వెంకట్‌రెడ్డి పార్టీ మార్పు విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరుగలేదని వెంకట్ రెడ్డి చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా ఆయన భవిష్యత్ రాజకీయాలపై చర్చ జరిగిందని స‌ర్వ‌త్రా భావిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా ఉన్న వెంకటరెడ్డి ప్రధాని మోడీతో భేటీ కావడంతో సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. అయితే రాజకీయంగా ఊహించిన రీతిలో వెంకటరెడ్డి ప్రధానితో భేటీ రాజకీయ అంశాలపై ఎలాంటి కొత్త మలుపులు లేకుండానే ముగిసినట్లయినది.

అయితే ఎన్నికలకు ముందు రాజకీయాలపై మాట్లాడుతానని, ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనేది అప్పుడే చెబుతానని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెల్లడించారు. రాజకీయాలపై తాను మాట్లాడలేదంటునే.. ప్రధానితో చర్చించిన కొన్ని అంశాలు చెప్పలేనన్నారు.

టి.కాంగ్రెస్ కమిటీల్లో చోటు దక్కలేదని భాద లేదని, మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనతో భేటీ అయిన సందర్భంలో అభినందనలు తెలిపానన్నారు. పార్టీ పారిస్థితులు ఖర్గేతో చర్చించానని పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ రైలు పొడగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదని ఈ విషయమై సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో భేటీ అవుతారని వెంకట్‌రెడ్డి చెప్పారు అభివృద్ధి పనుల కోసం మోడీని మళ్లి మళ్లీ కలుస్తానన్నారు.

Latest News