విధాత: వడగళ్ల వాన రైతులను ఆదుకోవాలన్న డిమాండ్‌తో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) లో కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)మంగళవారం తలపెట్టిన దీక్ష శిబిరం వద్ద ప్లెక్సీలను మరో సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్. దామోదర్ రెడ్డి (R. Damodar Reddy) వర్గీయులు చించి వేశారు. దామోదర్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో వెంకటరెడ్డి దీక్షకు పూనుకోవడం నచ్చని దామన్న వర్గీయులు ఫ్లెక్సీ చించివేసినట్టుగా తెలుస్తుంది.
కొద్దిసేపటికి తిరిగి కోమటిరెడ్డి వర్గీయులు మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటుకు సిద్ధపడగా ఇరువర్గాల మధ్య ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. కోమటిరెడ్డి వర్గీయుడు ఇటికాల చిరంజీవి దామోదర్ రెడ్డి వర్గీయులైన చెవిటి వెంకన్న తో మాట్లాడి ఇద్దరు నాయకుల ఫ్లెక్సీలతో దీక్ష నిర్వహించాలని చర్చించారు. కాగా రైతుల కోసం చేపట్టిన దీక్షలోనూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గ పోరు చూసిన ప్రజలు, రైతులు ఇక ఈ వీరు మారరా అని, వరుసగా రెండు పర్యాయలు అధికారంకు దూరమైన కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు మారకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.