- పలు అంశాలపై చర్చించినట్టు ప్రకటన
విధాత: సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komatireddy Venkt reddy) సోమవారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే(Manik Rao Thackeray)తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి తాను ఠాక్రేతో చర్చించినట్లుగా వెల్లడించారు.
70 శాతం ఎమ్మెల్యే అభ్యర్థులను ఆరు నెలల ముందే ప్రకటించేలా చూడాలని కోరినట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రల గురించి కూడా చర్చించామన్నారు. పాదయాత్రల నిర్వహణ పైన, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం పైన నేను కొన్ని సూచనలు చేశానని, నా సలహాలను థాక్రే స్వీకరించారన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా నల్గొండలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీతో బహిరంగ సభ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే అంశాలపై దాదాపు గంట 45 నిమిషాల వరకు చర్చించడం జరిగిందన్నారు. అయితే భేటీ సందర్భంగా ఇటీవల సొంత పార్టీ నేత పిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌కు, తనకు మధ్య జరిగిన వివాదంపై కూడా ఠాక్రే కు వెంకటరెడ్డి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.