Site icon vidhaatha

Paytm | పేటీఎంను జియో టేకోవర్‌..! క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!

Paytm | దేశానికి కెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంప్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పేటీఎం మనుగడ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మార్చి ఒకటి నుంచి డిపాజిట్లు సేకరించకుండా ఆదేశాలు జారీచేసిన నాటి నుంచి పేటీఎం షేర్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో పేటీఎం వ్యాలెట్‌ను దేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టేకోవర్‌ చేయబోతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.


అయితే, దీనిపై పేటీఎం కీలక ప్రకటన చేసింది. తమ వ్యాపారాన్ని విక్రయించేందుకు ఏ కంపెనీతో చర్చలు జరుపడం లేదని స్పష్టం చేసింది. అమ్మకం కోసం సంప్రదింపులు జరుపలేదని పేటీఎం వర్గాలు ప్రకటించాయి. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో పేటీఎం చిక్కుల్లోపడింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో సంప్రదింపులు జరుపుతోందని ప్రచారం జరిగింది. మరో వైపు ఈ అంశంపై పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.


మార్కెట్‌ ఊహాగానాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, రెగ్యులేటర్‌ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పీపీబీఎల్‌ అందించే ప్రొడక్ట్స్‌ వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. అయితే, పేటీఎంను టేకోబర్‌ చేయబోతుందున్న వార్తల నేపథ్యం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు సోమవారం ర్యాలీని కొనసాగించాయి.


జియో ఫిన్‌ కంపెనీ షేరు 13.91శాతం పెరిగింది. వాస్తవానికి పేటీఎం, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మధ్య గతేడాది నవంబర్‌ నుంచే చర్చలు జరుగుతున్నట్లు ఫిన్‌టెక్‌ అధికారులు, బ్యాంకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ధ్రువీకరించడం కొసమెరుపు. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలను గుర్తించిన ఆర్‌బీఐ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయకుండా నిషేధం విధించింది.


వాస్తవానికి ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ నిర్వహణ తీరు సరిగా లేదని, సరైన వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టకుండానే వందల ఖాతాలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ క్రియేట్‌ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మార్చి ఒకటో తేదీ నుంచి డిపాజిట్ల సేకరణ, క్రెడిట్‌ ఫెసిలిటీ కల్పించకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. అలాగే నో యువర్ కస్టమర్– కేవైసీ నిబంధనలు అమలు చేయకుండానే రూ.వందలకట్ల లావాదేవీలు నిర్వహిస్తుందనే అనుమానాలున్నాయి.


ఇందులో హవాలా లావాదేవీలు జరిగినట్లు సందేహాలు వ్యక్తమయ్యాయి. వెయ్యికపైగా యూజర్లు తమ ఖాతాకాలకు ఒకే పాన్‌ నంబర్‌ లింక్‌ చేసినట్లు పీపీబీఎల్ బయటి ఆడిటర్లు, ఆర్‌బీఐ చేపట్టిన విచారణలో వెల్లడైంది. సరైన వెరిఫికేషన్‌ చేయకుండానే ఖాతాలను క్రియేట్‌ చేశారని, ఇందులో మనీలాండరింగ్‌ జరిగి ఉండవచ్చని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేశారు. పేటీఎంలో మనీలాండరింగ్‌ నేపథ్యంలో ఈడీ సైతం జరుపన్నుట్లు రెవెన్యూ కార్యదర్శి ప్రకటించారు.


దాంతో పరిస్థితి మరింత జఠిలం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. మనీలాండరింగ్ ఆరోపణలుంటే ఈడీ దర్యాప్తు చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి పేర్కొన్నారు. మరో వైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ని సైతం రద్దు చేసే పరిస్థితి ఆందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పేటీఎంలో డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Exit mobile version