జంట హత్యల కేసు ఛేదించిన దెయ్యాల బావిలో కాగితం ముక్కపై రాసిఉన్న మొబైల్‌ నంబర్‌!

2023 అక్టోబర్‌లో ఓ ఇద్దరు పిల్లలు గోవండి అడవుల్లోని ఒక పాడుబడిన బావిలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ఒక బాలుడి కాళ్లు ఒక శవాన్ని తాకాయి

  • Publish Date - March 28, 2024 / 12:23 PM IST

2023 అక్టోబర్‌లో ఓ ఇద్దరు పిల్లలు గోవండి అడవుల్లోని ఒక పాడుబడిన బావిలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ఒక బాలుడి కాళ్లు ఒక శవాన్ని తాకాయి. వాళ్లు వెంటనే స్థానికులను అప్రమత్తం చేశారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావి నుంచి శవాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించగా.. పర్సులాంటి ఒక చిన్న సంచి తాగి పడేసిన మద్యం బాటిళ్ల మధ్య కనిపించింది. ఆ సంచిని పోలీసులు తెరిచి చూడగా.. ఒక కాగితం ముక్కపై గజిబిజిగా రాసి ఉన్న ఒక మొబైల్‌ నంబర్‌ కనిపించింది.


ఆ నంబర్‌కు పోలీసులు కాల్‌ చేస్తే.. ఎవ్వరూ కాల్‌ను ఆన్సర్‌ చేయలేదు. దాంతో పోలీసులు ఆ నంబర్‌పై కాల్‌ డాటాను తనిఖీ చేశారు. ఒక నంబర్‌ నుంచి ఈ నంబర్‌కు పదే పదే ఒక వ్యక్తి కాల్‌ చేసినట్టు గుర్తించారు. దాంతో సదరు వ్యక్తికి పోలీసులు ఫోన్‌ చేయగా.. ఆయన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా తేలింది. ఆయన మృతుడిని కరణ్‌ చంద్రగా గుర్తించాడు. 22 ఏళ్ల కరణ్‌చంద్ర తన భార్య గుల్‌నాజ్‌ ఖాన్‌తో కలిసి ఇటీవల ముంబై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.


దీంతో ధారావిలో ఉంటున్న గుల్‌నాజ్‌ కుటుంబాన్ని పోలీసులు సంప్రదించారు. అయితే.. గుల్‌నాజ్‌ కూడా కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుల్‌నాజ్‌ కూడా హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానించారు. అందులోనూ ఆమె ముస్లిం అవడంతో మతాంతర వివాహం ఈ హత్యకు కారణమై ఉంటుందా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో పోలీసులకు ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అప్పటి దాకా ఆ దంపతులు యూపీలోని బందా జిల్లాలో నివాసం ఉండేవారు. అయితే.. గుల్‌నాజ్‌తో మాట్లాడిన ఆమె కుటుంబీకులు.. ఆమె తిరిగి వచ్చేలా ఒప్పించారని తెలిసింది.


వాస్తవానికి మొదట్లో ఆ కుటుంబం వారిద్దరి వివాహానికి వ్యతిరేకంగా ఉన్నది. అయితే.. ఆమె తండ్రి.. వారి వివాహాన్ని ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.దీంతో ఆ రాత్రే కరణ్‌, గుల్‌నాజ్‌ ముంబైకి తిరుగుపయనమయ్యారని పోలీసులు తెలిపారు. అనంతరం కరణ్‌చంద్రను గుల్‌నాజ్‌ తండ్రి, ఆమె ఇద్దరు సోదరులు, మరో ముగ్గురు వ్యక్తులు గోవండికి తీసుకెళ్లారు. నిందితులు కరణ్‌ మెడ, కడుపు, వీపుపై కత్తితో పొడిచి, ఎవరూ గమనించే అవకాశం లేదని పాడుబడిన బావిలో పడేశారని పోలీసులు తెలిపారు. గుల్‌నాజ్‌ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. గుల్‌నాజ్‌ను కుటుంబ సభ్యులు క్యాబ్‌లోనే చంపేశారని, శవాన్ని నవీ ముంబైలో పడేశారని వెల్లడైంది.


ఈ కేసులో గుల్‌నాజ్‌ తండ్రి, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె సోదరులు సహా నలుగురు మైనర్లు పరారైనా.. వారిని పోలీసులు పట్టుకున్నారు. కరణ్‌చంద్ర, గుల్‌నాజ్‌ 2022లో పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే.. వారు ఎక్కడ ఉన్నదీ గుల్‌నాజ్‌ కుటుంబ సభ్యులకు తెలియలేదు. అయితే.. వారి ఎక్కడ ఉన్నారో తెలుసుకున్న గుల్‌నాజ్‌ కుటుంబీకులు.. వారి వివాహానికి సమ్మతిస్తున్నట్టు నమ్మించి.. ఇంటికి తిరిగి రావాల్సిందిగా కోరారు. ఇంటికి వెళ్లడం అంటే.. చావును కోరి తెచ్చుకోవడమేనన్న విషయాన్ని గమనించలేక.. ఆ ఇద్దరూ ముంబైకి పయనమయ్యారని, వారిని గుల్‌నాజ్‌ తల్లిదండ్రులే చంపేశారని తేలింది.

Latest News