Site icon vidhaatha

YADADRI: మురళీ కృష్ణుడిగా.. ఉగ్రనరసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శనివారం స్వామివారు మురళీ కృష్ణుడి అవతార అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయంలో మూలవరులకు నిత్యాభిషేక, అర్చనలు నిర్వహించాక వేంచేపు మండపంలో స్వామివారికి మురళీకృష్ణ అలంకార సేవ నిర్వహించారు.

ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యుల అర్చక బృందం, యాజ్ఞికుల బృందం పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ఉగ్ర నరసింహుడిని మురళీకృష్ణుడిగా అలంకరించారు. మంగళ హారతి అనంతరం మాడవీధుల్లో ఊరేగించారు.

హిరణ్యకశ్యపుడి వధకు స్తంభోద్భవుడిగా భీకర ఉగ్ర నరసింహ రూపం దాల్చిన శ్రీమహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడిపై ప్రేమతో కరుణామూర్తిగా ప్రసన్నమవుతాడు. శాంతా మూర్తియైన నరసింహుడు జగద్గురు మురళీకృష్ణుడిగా భక్తులకు నేనున్నానంటూ అభయమిస్తాడని ప్రసిద్ధి. జ్ఞాన స్వరూపమైన కృష్ణావతారంలో శ్రీవారు గీత కర్మ జ్ఞానాలను భక్తులకు అనుగ్రహిస్తాడు.

మురళీ కృష్ణుని అలంకారంలో ఊరేగిన లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి ,ఆలయ అధికారులు,సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం బ్రహ్మోత్సవాల పర్వంలో భాగంగా స్వామివారికి పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.

Exit mobile version