Site icon vidhaatha

చకిలం స్మరణలో పార్టీలు..! పాల్గొన్న BRS, కాంగ్రెస్‌, BJP నాయకులు

విధాత: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో పేరొందిన దిగ్గజ నాయకుల్లో ఒకరైన దివంగత సర్దార్ చకిలం శ్రీనివాసరావు పంతులు శత జయంతి వేడుకలు జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలో సోమవారం అట్టహాసంగా జ‌రిగాయి.

బీఆర్ఎస్ పార్టీ నేత, చకిలం అనిల్ కుమార్ తన తండ్రి శత జయంతి వేడుకలను “పేదోడి గుండె చప్పుడు.. బడుగుల గొంతుక సర్దార్ చకిలం శ్రీనివాసరావు పంతులు” నినాదంతో రామగిరి సెంటర్‌లో శ్రీనివాసరావు విగ్రహం వద్ద శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పార్టీలకు అతీతంగా అనిల్ కుమార్ తన తండ్రి శత జయంతి వేడుకలకు వివిధ పార్టీల్లో ఉన్న శ్రీనివాసరావు అభిమానులను అందరిని సభకు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు.

ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు హాజరవ్వడం విశేషం. దివంగత ప్రధాని పీ.వీ నరసింహారావు తనయుడు పీ.వీ ప్రభాకర్ రావు సభకు ముఖ్యఅతిథిగా హాజరై తన తండ్రి పీ.వీ. నరసింహారావుతో చకిలం శ్రీనివాసరావుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

పీవీ మాదిరిగానే చకిలం కూడా నిస్వార్థ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. నాయకుడిగా ముందుండి సర్దార్ అనిపించుకొని, పంతులుగా పిలిపించుకొని జనానికి ఆత్మీయుడిగా చకిలం విభిన్న నాయకత్వ శైలిని ప్రదర్శించారన్నారు. రాజకీయాల్లో వారసుల హవా నడుస్తున్న ఈ కాలంలో చకిలం తనయుడు అనిల్ కుమార్‌కు ఇప్పటిదాకా సరైన గుర్తింపు దక్కలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో పదవులు అనిల్‌ను వెతుక్కుంటూ వస్తాయని ఆకాంక్షించారు. సభలో వక్తలంతా రాజకీయాలకు అతీతంగా మాట్లాడి జిల్లా రాజకీయాల్లో ఆనాడు చకిలం వేసిన ముద్రను కొనియాడటం గమనార్హం. సైతాంతిక నిబద్ధతతో కూడిన రాజకీయాలకు చకిలం మారుపేరుగా నిలిచారన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఆయన సాగించిన రాజకీయాలు, ప్రజాసేవ జిల్లా రాజకీయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. చకిలం స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలకు సరైన గుర్తింపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నేటి రాజకీయాలు డబ్బు ప్రధానంగా కొనసాగుతున్న తీరు దురదృష్టకరమన్నారు.

సభ నిర్వాహకులు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. డబ్బుంటేనే రాజకీయాలు, పదవులు అన్నట్లుగా నేడు పరిస్థితులు మారిపోవడం దురదృష్టకరమన్నారు. చకిలం వారసుడిగా ఆయన రాజకీయ పోరాట స్ఫూర్తితో జిల్లా ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు.

మా సహనం ఇంకా పరీక్షించవద్దని కొందరు మేము చేసిందే రాజకీయం అనుకుంటున్నారని, మేం మొదలుపెడితే మీరు తట్టుకోలేరంటూ పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలోని తన ప్రత్యర్థులను హెచ్చరించారు. తన తండ్రి స్ఫూర్తితో పేదలు, బడుగుల సంక్షేమానికి అండగా నిలబడతామన్నారు.

కాగా.. అనిల్ కుమార్ నిర్వహించిన ఈ సభకు జనం రాకుండా నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు తెర వెనుక ప్రయత్నాలతో అడ్డుపడినప్పటికి సభ విజయవంతం కావడం అనిల్ వర్గీయుల్లో ఉత్సాహం నింపింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, రాపోలు దత్త గణేష్, తిరునాగరి భార్గవ్, బీఆర్ఎస్ నాయకులు పిల్లి రామరాజు, కన్నారావు, బీజేపీ నాయకులు ఒరుగంటి రాములు తదితరులు పాల్గొన్నారు.

అటు కాంగ్రెస్ పార్టీ సైతం చకిలం తమ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను స్మరిస్తూ జిల్లా కేంద్రంలో చకిలం శత జయంతి ఉత్సవాలను నిర్వహించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రామగిరి చకిలం శ్రీనివాసరావు విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్, దుబ్బాక నరసింహారెడ్డి, నాయకులు చెరుకు సుధాకర్ గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, పెరికె వెంకన్న ప్రభృతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Exit mobile version