Site icon vidhaatha

Nalgonda | కమలం సారథ్యానికి పోటాపోటీ.. అధిష్టానం వద్ద జోరు యత్నాలు!

విధాత: నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల బీజేపీ (BJP) జిల్లా పార్టీల నూతన అధ్యక్ష పదవుల కోసం కమలం పార్టీలో మునుపెన్నడూ లేని రీతిలో పోటీ నెలకొనగా అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి క్లిష్టతరంగా మారింది. ఎన్నికల సంవత్సరం కావడం.. రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో జిల్లాల బీజేపీ సారధ్యం కోసం పార్టీ నాయకులు ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

తమకు తెలిసిన రాష్ట్ర, జాతీయ నాయకుల ఆశీస్సులు తీసుకోవడంతో పాటు పార్టీ మున్సిపాలిటీ, మండల, గ్రామ శాఖల నాయకుల మద్దతును కూడగట్టుకుంటూ తమకంటే తమకే జిల్లా పార్టీ సారధ్యం కట్టబెట్టాలంటూ ఆశావహులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పై పార్టీ కేడర్లో నెలకొన్న అసంతృప్తి నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని కమలం పార్టీ అధిష్టానం భావిస్తుంది.

అయితే కొత్త అధ్యక్షుడి రేసులో నల్లగొండ నియోజక వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి పోతేపాక సాంబయ్య, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలు, దేవరకొండకు చెందిన లాలు నాయక్, నాంపల్లికి చెందిన సీనియర్ నేత ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ల పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో టీడీపీ నుండి బీజేపీలోకి వచ్చిన బీసీ నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్ పేరు సామాజిక సమీకరణల నేపథ్యంలో ముందు వరుసలో ఉండగా, ఇప్పటిదాకా అవకాశం దక్కని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి ఈ దఫా జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

గతంలో తమ బాధ్యతను అనుసరించి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించకుండా, పార్టీ విస్తరణ లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైన నాయకులను, ఇతర పార్టీల వారితో లోపాయికారి సంబంధాలను కల్గిన నేతలను జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికలో పరిశీలనలోకి తీసుకోవద్దన్న వాదన వినిపిస్తుంది.

జిల్లా అధ్యక్షుడు అయిన వారు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా విస్తృతంగా పర్యటించాల్సిన అవసరం ఉందని, ఈ కోణంలో జిల్లా పార్టీ కొత్త సారధిని ఎంపిక చేస్తే ఎన్నికల సంవత్సరం లో పార్టీ బలోపేతానికి ప్రయోజనకరంగా ఉంటుందని క్యాడర్ కోరుతుంది.

అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మరికొందరు నేతలు కూడా జిల్లా పార్టీ సారధ్య బాధ్యతలకు పోటీపడే అవకాశం ఉంది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న గంగిడి మనోహర్ రెడ్డి తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుల ఎంపికలో కీలకంగా మారనున్నారు.

అటు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి ఏడాదిన్నర క్రితమే బాధ్యతలు స్వీకరించినందునా ఆయనను రెన్యువల్ చేయాలంటూ కొందరు, ఎన్నికల దృష్ట్యా కొత్త సారధిని ఎంపిక చేయాలని మరికొందరు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా కొత్త అధ్యక్షుడి రేసులో భాగ్యారెడ్డితో పాటు రంగరాజు రుక్మారావు, బొలిశెట్టి కృష్ణయ్య, గట్టు శ్రీకాంత్ రెడ్డి ల పేర్లు ఉన్నాయి.

ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు పి.వి. శ్యాంసుందర్ రావు స్థానంలో కొత్త అధ్యక్షుని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రేసులో పార్టీ సీనియర్లు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పడమటి జగన్ మోహన్ రెడ్డి, పాశం భాస్కర్, పోతంశెట్టి రవీందర్ ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వారితో పాటు భువనగిరి,ఆలేరు నియోజకవర్గాల్లోని ఇతర మండలాల పార్టీ సీనియర్ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. దీంతో ఈ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక కూడా జఠిలంగా తయారైంది. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లా పార్టీల కొత్త అధ్యక్షుల నియామకం చేసేందుకు ఇప్పటికే పార్టీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

తాజాగా ఏపీ రాష్ట్రంలో ఒకేసారి 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను, కోకన్వీనర్లను నియమించిన బీజేపీ అధిష్టానం అంతకుముందే ఎన్నికలు జరగనున్న తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ సంస్థాగత నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే నల్లగొండ, సూర్యపేట ,యాదాద్రి భువనగిరి జిల్లాల బిజేపికి కొత్త జిల్లా అధ్యక్షులు నియామకం తధ్యమని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

Exit mobile version