నాందేడ్ సభ.. రంగంలోకి దిగిన BRS శ్రేణులు

విధాత, నిజామాబాద్: బీఆర్ఎస్‌గా అవతరించిన తర్వాత తొలిసారిగా తెలంగానేతర ప్రాంతమైన నాందేడ్ లో సభ నిర్వహించనుండ‌డంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభపై వివిధ రాజకీయ పక్షాలు, మేధావులు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా సభను విజయవంతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్పుడే రంగంలోకి దిగారు. అక్క‌డే ఉండి స‌భ‌కు ఏర్పాట్లు.. ఒక వైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జుక్కల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు […]

  • Publish Date - January 27, 2023 / 01:33 PM IST

విధాత, నిజామాబాద్: బీఆర్ఎస్‌గా అవతరించిన తర్వాత తొలిసారిగా తెలంగానేతర ప్రాంతమైన నాందేడ్ లో సభ నిర్వహించనుండ‌డంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సభపై వివిధ రాజకీయ పక్షాలు, మేధావులు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా సభను విజయవంతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్పుడే రంగంలోకి దిగారు.

అక్క‌డే ఉండి స‌భ‌కు ఏర్పాట్లు..

ఒక వైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జుక్కల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే బాల్క సుమన్ నాందేడ్ లోనే వుండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాందేడ్ ఎస్పీ కృష్ణ కోప్తేను కలిసి సభకు అనుమతి కావాలని గురువారం దరఖాస్తు చేశారు. అదే విధంగా నాందేడ్ లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులను కలిసి సభకు మద్దతు కూడ గడుతున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆయా నాయకులు, ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆనుకొని వున్న సమీప గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నాందేడ్ సభకు పలువురిని సిద్ధం చేయడం మొదలైంది. సమీపంలోని బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తదితర పట్టణాల పరిసర గ్రామాల్లో బిఆర్ఎస్ ప్రచారం ప్రారంభించారు.

మ‌హారాష్ట్ర‌లో మిశ్ర‌మ స్పంద‌న‌

ఎంపీ బీబీ పాటిల్ అనుచరులు ముందు వరసలో వుండి సమీప గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా ఎస్గి గ్రామంలో బీబీ పాటిల్ అనుచరులు పండిత్ రావు, శంకర్ రావుల ఆధ్వర్యంలో పార్టీలోకి పలువురు స్థానికులను ఆహ్వానించారు. అదే విధంగా నాందేడ్ సభ గురించి వివరిస్తూ సభకు తరలి రావాలని కోరారు. మరికొంత మంది నాయకులు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో సైతం సభకు హాజరు కావాలని ప్రజలను చైతన్య పరుస్తున్నారు. మహారాష్ట్ర గ్రామాల్లో నాందేడ్ సభపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది.

నాందేడ్‌లో తెలుగువారు అధికంగా ఉండడం వ‌ల్లే..

కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో వుంది. ముఖ్యంగా నాందేడ్, నిజామాబాద్ జిల్లా మధ్య సామాజిక బంధాలు, విద్యా, వైద్య, వ్యాపార పరమైన లావాదేవీలు ఉన్నాయి. దీనికి తోడు నాందేడ్ జిల్లాలో తెలుగు మాట్లాడే వారు అధికంగా ఉండడం వల్ల బీఆర్ఎస్ సభకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయని భావించి నాందేడ్‌లో తొలి సభ నిర్వహించను న్నట్లు తెలుస్తోంది.

బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మరాఠి భాష మాట్లాడే వారు కూడా అధికంగా ఉండడం సభ సక్సెస్ కు దోహదపడుతుంది. ఇలా భిన్నమైన కోణాల్లో ఇరు ప్రాంతాల్లో వున్న సారూప్యత కారణంగానే నాందేడ్ సభ సక్సెస్ అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Latest News