Site icon vidhaatha

యాదగిరిగుట్ట: సింహ వాహనంపై విహరించిన నారసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం గోవర్ధనగిరి ధారి అలంకార సేవలు అందుకున్న లక్ష్మీ నరసింహుడు సాయంత్రం సింహవాహ‌నధారుడై తిరువీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, యజ్ఞాచార్యులు, పారాయణికులు, భక్తుల సమక్షంలో మేళ, తాళాలు మంగళ వాయిద్యాల మధ్య మృగ నరహరి నరసింహుడు సింహ వాహనాన్ని అధిష్టించి తిరువీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

భగవద్గీతలో భగవంతుడు జంతువులలో తాను సింహ రూపుడనై ఉన్నానని పేర్కొనడం సింహవాహన విశిష్టతను చాటుతుంది. సింహవాహనంపై ఊరేగిన లక్ష్మీ నరసింహుడుని దర్శించుకుని భక్తులు పులకించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

మరోవైపు బ్రహ్మోత్సవాల పర్వంలో భాగంగా కొనసాగుతున్న సంగీత, సాహిత్య, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం సాయంత్రం కూడా ఉత్సాహంగా సాగాయి. డాక్టర్ ఆనంద శంకర్ జయంత భరత నాట్యం, మంగల్ భట్ బృందం కథక్ నృత్యం, మల్లాది బ్రదర్స్ కర్ణాటక గాత్ర కచేరి ఆకట్టుకున్నాయి. శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతభేరి నిర్వహించారు.

Exit mobile version