విధాత: నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులకు మగ కవలలు జన్మించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసినా ఈ కవలల గురించే చర్చ జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న నయన తార, విఘ్నేశ్ శివన్ అప్పుడే పిల్లలను కనడం ఎలా సాధ్యమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే వారు సరోగసి ద్వారా పిల్లలను కన్నారని ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు నయన్ విఘ్నేశ్ కు జన్మించిన పిల్లల వార్త వైరల్ అయింది. అంటే పెళ్లికి ముందే వీరు పిల్లలను కనేందుకు సరోగసిని ఎంచుకున్నారని తేలిపోయింది.
అసలు సరోగసి అంటే ఏమిటి..?
భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. పిల్లలను కనేందుకు ఇష్టపడరు. ఈ పరిస్థితుల్లో వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కంటారు. అంటే భార్య అండాన్ని, భర్త వీర్యాన్ని సేకరించి, మరో మహిళ గర్భంలో ఇంజెక్టు చేస్తారు. అలా ఆమె 9 నెలల పాటు శిశువును మోసి కంటుంది.
నయనతార విషయంలోనూ అదే జరిగింది. మంచు లక్ష్మి కూడా ఇదే పద్దతిలో తల్లి అయింది. సరోగసి అంశంగా గతంలో చియాన్ విక్రమ్, సౌందర్య జంటగా 9 నెలలు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెల్‌కం ఓబామా సినిమాలు కూడా వచ్చాయి.
నయన్ విఘ్నేశ్.. ఎంత ఖర్చు పెట్టారంటే..?
అయితే సరోగసి ద్వారా కవల పిల్లలను కన్న నయనతార.. అందుకు ఎంత ఖర్చు చేసి ఉండొచ్చని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ పద్ధతికి నయన్ దంపతులు రూ.కోటి ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఖర్చు విషయంలో నయన్ విఘ్నేశ్ నోరు విప్పితేనే అసలు విషయం తెలియనుంది.
స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి
అయితే నయనతార సరోగసిపై వివాదం ముదిరిన నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం స్పందించారు. సరోగసి వివరాలను వెంటనే తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన ఆదేశించారు.
4 నెలల క్రితం పెళ్లయిన జంట అప్పుడే సరోగసీ ద్వారా గర్భం దాల్చగలరా..? లేదంటే దానికి ఏదైనా కాల పరిమితి ఉందా అని మీడియా సమావేశంలో మంత్రి సుబ్రహ్మణ్యంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఈ సరోగసి అంశంపై తమ శాఖ వివరణ కోరుతుందని.. అన్ని వివరాలు త్వరలోనే చెప్తామని తెలియజేసారు.