ఇండియా కూటమిలో సర్దుబాటు కొలిక్కి!

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలనే కమలనాథుల ఆశలు అడియాసలయ్యాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల పంపకంలో తలెత్తిన వివాదం వల్ల రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి

  • Publish Date - February 22, 2024 / 11:30 AM IST

  • కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ యత్నం
  • తట్టుకుని నిలబడిన భాగస్వామ్య పక్షాలు
  • ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు
  • సమరోత్సాహంతో ఎన్నికల బరిలోకి
  • బీజేపీకి తలనొప్పిగా రైతుల ఆందోళన
  • రైతు మరణంతో అన్నదాతల్లో ఆగ్రహం
  • ప్రాంతీయ పార్టీలను చేరదీస్తున్న బీజేపీ
  • తెలంగాణలో బీఆరెస్‌తో పరోక్ష ఒప్పందం!



(విధాత ప్రత్యేకం)


ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలనే కమలనాథుల ఆశలు అడియాసలయ్యాయి. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల పంపకంలో తలెత్తిన వివాదం వల్ల రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. దీంతో ఎస్సీ, కాంగ్రెస్‌ మధ్య సయోధ్య కుదరటం కష్టమే అన్న ప్రచారం జరిగింది. కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ రావడానికి యూపీలో ఆ పార్టీకి వచ్చిన సీట్లే ప్రధాన కారణం.


ఈసారి అక్కడ బీజేపీ ఎదురీదుతున్నదని అర్థమౌతున్నది. అందుకే ఆర్‌ఎల్‌డీని కలుపుకొని నాలుగైదు సీట్లు ఎక్కువ సంపాదించుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నది. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడానికి పరోక్షంగా బీజేపీనే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ ఓటమే లక్ష్యంగా బీఎస్పీ పనిచేసింది.


ఫలితంగా బీజేపీ లబ్ధి పొందింది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈసారి ఎస్పీ, కాంగ్రెస్‌.. బీజేపీ దూకుడుకు యూపీలోనే అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం ఎనభై స్థానాలున్న ఆ రాస్ట్రంలో 63 స్థానాల్లో ఎస్పీ, 17 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. అధికార ప్రకటనే మిగిలింది. మద్యప్రదేశ్‌లోనూ ఖజురహో స్థానాన్ని ఎస్పీకి కేటాయించింది. మిగిలిన 28 స్థానాల్లో ఆ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపనున్నది.


ఆప్‌తో సీట్ల సర్దుబాటు


పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ విడిగా పోటీ చేయనున్నాయి. అయితే.. మిగిలిన చోట్ల రెండు పార్టీలు అవగాహనకు రానున్నాయి. 7 స్థానాలున్న ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాలు కోరుతున్నది. దీనికి బదులుగా హర్యానా, గోవా, అస్సాం, గుజరాత్‌లలో ఒక్కో స్థానాన్ని ఆ పార్టీకి కేటాయిస్తామని ప్రతిపాదించింది. దీనిపై రెండు పార్టీల మధ్య ఒప్పందం కురిరే అవకాశాలున్నాయి. ఆప్‌ 4 చోట్ల, కాంగ్రెస్‌ పార్టీ 3 చోట్ల పోటీ చేయడానికి సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే పొత్తు లేకుండా ఆప్‌ 2014, 2019లో ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్‌, బీజేపీ కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరులో 7 సీట్లు కాషాయపార్టీ ఖాతాలో పడ్డాయి.


దీంతో ఈసారి ఆ తప్పును ఆప్‌ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. దీనికి బలం చేకూర్చే విధంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. తమ రెండుపార్టీల మధ్య చర్చలు చివరి దశకు వచ్చాయని కొన్నిరోజుల కిందటే అన్నారు. ఇప్పటిదాకా సీట్ల సర్దుబాటు అంశం కాంగ్రెస్‌ కోర్టులో ఉన్నది. పంజాబ్‌ విషయంలో ఆప్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పేచీ పెట్టడం లేదు. కాబట్టి ఆప్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోక తప్పదు.


ఎందుకంటే యూపీలో తొలుత ఆర్‌ఎల్‌డీతో ఒప్పందం చేసుకుని ఆ పార్టీకి ఐదు సీట్లు ఆఫర్‌ చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ పార్టీ బీజేపీతో జతకట్టాలని నిర్ణయించుకున్నది. దీంతో మొదట కాంగ్రెస్‌ పార్టీకి 11 సీట్లను మాత్రమే ఇస్తామన్న ఎస్పీ అధినేత ఇప్పుడు మరో 6 సీట్లు కూడా ఇస్తామనడంతో రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది. తాజాగా ఆప్‌ కూడా తుది నిర్ణయం తీసుకోక తప్పదంటున్నారు.


మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఓకే


మరోవైపు 48 స్థానాలున్న మహారాష్ట్ర, 39 స్థానాలున్న తమిళనాడులోనూ ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం దాదాపు కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలిక తెచ్చిన బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో గత ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తున్నారు. షిండే, అజిత్‌పవార్‌ వర్గాల ద్వారా వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని అనుకుంటున్నది. కానీ అధికారం కోసం ప్రాంతీయ పార్టీల్లో చీలిక తెచ్చిన బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ఠాక్రే వ్యూహ రచన చేశారు.


కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. 48 స్థానాలున్న ఆ రాష్ట్రంలో 39 స్థానాల్లో కూటమిలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. మిగిలిన స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నది. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉన్నది. శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ కలిస్తే తమకు నష్టం తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలను ప్రలోభ పెట్టి కాషాయ తీర్థం పుచ్చుకునేలా చేశారు. అయినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు వచ్చే నష్టమేమీ లేదని విశ్లేషకులు అంచనా. బీహార్‌లో ఇండియా కూటమి నుంచి జేడీయూ వెళ్లిపోయిన తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటుకు మార్గం సుగమమైంది.


ఆ రెండుపార్టీల మధ్య మొదటి నుంచి మంచి అవగాహన ఉన్నది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, తెలంగాణ, ఒడిషా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మెజారిటీ సీట్లలో పోటీ చేయనున్నది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, ఒడిషాలో బిజూ జనతాదళ్‌ తోనే కాంగ్రెస్‌ పార్టీకి పోటీ ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా తలపడనున్నది. అలాగే వామపక్షాలతో కలిసి బెంగాల్‌, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నది. ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి పోటీ చేయనున్నది.


బీజేపీకి రైతుల ‘ఆందోళన’


బీజేపీ బైటికి ఈసారి 400 సీట్లు వస్తాయని బైటికి చెప్పుకుంటున్నా అది అంత ఈజీ కాదని అర్థమైంది. అందుకే మొన్నటి నుంచి 370 ఆర్టికల్‌ను రద్దు చేశాం కాబట్టి 370 సీట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీ ఇండియా కూటమి దూకుడుకు తోడు రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ పోరు బాట పట్టారు. స్వామినాథన్‌కు భారత రత్న ఇచ్చి గౌరవించిన కేంద్ర ఆయన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


దీంతో ఈసారి బీజేపీ ఓట్లు భారీ స్థాయిలో గండి పడొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీజేపీ నేతల్లోనూ ఈ ఆందోళన కనిపిస్తున్నది. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌ పెట్టడానికి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను బీజేపీ చేరదీస్తున్నది. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని వెళ్లాలని ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే యూపీలో ఆర్‌ఎల్‌డీ, బీజేపీలో జేడీయూ, కర్ణాటకలో జేడీఎస్‌లను కలుపుకున్నది.


తెలంగాణలోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని, లేదు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటారనే వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కమలనాథుల టార్గెట్‌ కాంగ్రెస్‌. అందుకోసం ప్రాంతీయపార్టీలతో రాజీ పడటానికి కూడా వెనుకాడటం లేదని టాక్‌. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి చర్చలు పూర్తి చేయాలని అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి కసరత్తు చేస్తున్నాయి.

Latest News