విధాత : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆదివారం ఉదయం నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతినిధుల నివాసాలు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో నిజామాబాద్, బైంసా, జగిత్యాల, ఏపీలోని కర్నూల్, నెల్లూరు, కడప జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్ఐఏ బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి.
నిర్మల్ జిల్లా బైంసాలోని మదీనా కాలనీలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు చేపట్టారు. జగిత్యాలలోని కేర్ మెడికల్, టీఆర్ నగర్‌లో సోదాలు నిర్వహించి డైరీలను, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర మూలాలు ఉన్నాయన్న సమాచారంతో ఎన్ఐఏ ఈ తనిఖీలు చేపట్టింది.