Site icon vidhaatha

వర్సిటీలో వాచ్‌మెన్‌ టూ గురుకుల లెక్చరర్‌

విధాత: అతను ఉన్నత చదువులు చదివాడు. జీవితంలో ఏదో సాధించాలని కలగన్నాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పని చేయాలనుకున్నాడు. తాను చేస్తున్న పనినే గౌరవప్రదంగా భావించాడు. పోటీ పరీక్షల్లో ప్రస్తుతం కాంపీటిషన్‌ గురించి చెప్పకనక్కరలేదు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న కాలం.


ఈ పోటీలో ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని సౌకర్యాలు ఉండి, చదువుకోవడానికి అన్ని వనరులుండి ఉద్యోగాలు పొందుతున్నవాళ్లు ఉన్నారు. కష్టాలకు ఎదురీదుతూ కొలువులు కొట్టినవాళ్లు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తూ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ప్రవీణ్‌ కుమార్‌ అందరకీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ అయిన 31 ఏళ్ల ప్రవీణ్‌ కుమార్‌ నైట్‌ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ సర్కార్‌ కొలువు సాధించాడు. అంతటితో ఆగకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడ్డాడు. గురుకుల నియామక బోర్డులో వెల్లడించిన పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ టీచర్‌(పీజీటీ ) అపాయింట్‌మెంట్‌ అందుకున్న ప్రవీణ్‌ నిన్న ప్రకటించిన గురుకుల జూనియర్‌ లెక్చరర్‌గా కూడా ఎంపికయ్యాడు. రేపు లెక్చరర్‌గా అపాయింట్‌మెంట్‌ అందుకోబోతున్నాడు. ప్రవీణ్‌కుమార్‌ సాధించిన విజయాల పట్ల యూనివర్సిటీ ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే యూనివర్సిటీలో ప్రభుత్వ కొలువుల కోసం ప్రిపేర్‌ అవుతున్న వేలాది మందికి ప్రవీణ్‌ ఇన్స్‌స్పిరేషన్‌గా మారాడు.

పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవాళ్లు తమ లక్ష్యసాధనలో చిత్తశుద్ధితో కృషి చేస్తే సక్సెస్‌ దానంతటే వెతుక్కుంటూ వస్తుందని ప్రవీణ్‌కుమార్‌ నిరూపించాడు. వాచ్‌మెన్‌గా మొదలైన ఆయన ఉద్యోగ ప్రస్థానం విద్యార్థులకు పాఠాలు బోధించే లెక్చరర్‌గా ఎదిగిన తన ప్రయాణం అభినందనీయం. ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని, పోస్టులు తక్కువగా ఉన్నాయని, పోటీ ఎక్కువగా ఉన్నదని నెగెటివ్‌ ఆలోచనలు ఉన్నవాళ్లకు ప్రవీణ్‌కుమార్‌ సాధించిన విజయాలు మోటివేషన్‌గా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.

Exit mobile version