Nitin Gadkari | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. 1991లో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతిని మార్చాయని, ఈ నేపథ్యంలో ఆయనకు ఈ దేశం రుణపడి ఉంటుందని గడ్కరీ పేర్కొన్నారు. మన్మోహన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడారు.
ఢిల్లీలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ పాల్గొని ప్రసంగించారు. పేద ప్రజలకు ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశానికి కొత్త మార్గాన్ని చూపాయని గడ్కరీ కొనియాడారు. 1991లో తాను మహారాష్ట్ర రవాణా మంత్రిగా ఉన్నానని, మన్మోహన్ సంస్కరణల వల్లే నిధులు బాగా సమీకరించగలిగానని గుర్తు చేశారు. పేదలు, రైతుల కోసం ఉదారవాద సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో తెలుసుకోవడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. భారత్ ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి సాధించాలంటే.. మరింత మూలధన పెట్టుబడి అవసరం అని గడ్కరీ పేర్కొన్నారు.