విధాత: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leak) పై ఎన్ఎస్‌యూఐ(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ హైకోర్టు(Hicourt)లో పిటిషన్(Petition) దాఖలు చేశారు. టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ(CBI) లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆ పిటిషన్‌లో కోరారు. పేపర్ లీకేజీలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందంటూ వెంకట్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సిట్ తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు.
ప్రభుత్వ ప్రమేయంపై విచారణ జరపాలి..
పేపర్ లీకేజీ సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేయాలని సిట్‌ను ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన సిట్ కీలక నిందితులను అరెస్ట్ చేసింది. ఇదే సమయంలో పరీక్షలను రద్దు చేసింది. అయితే ఇందులో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీలు, ఇతర విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
మరో వైపు టీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని మొత్తం రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీ సంఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తుందన్న అనుమానాలతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.