ఓ 62 ఏండ్ల వృద్ధుడు 28 ఏండ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది ఇద్దరు తమ కుటుంబాలను వదిలేసి, చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య చేసిన ఫిర్యాదుతో ఈ ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని సర్క్యూట్ గెస్ట్ సమీపంలో ఓ రిటైర్డ్ డీఈ నివాసముంటున్నాడు. ఈయన మహబూబాబాద్ జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో డీఈగా పని చేసి పదవీ విరమణ పొందారు. అయితే అక్కడ పని చేస్తున్న క్రమంలో ఓ 28 ఏండ్ల యువతితో డీఈకి పరిచయం ఏర్పడింది. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగినే. దీంతో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ వ్యవహారానికి దారి తీసింది. ఇక ఇద్దరు కలిసి బయట తిరగడం మొదలు పెట్టారు.
ఇటీవల డీఈ కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన భార్య తన భర్త కనిపించడం లేదంటూ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా డీఈ శ్రీశైలంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి డీఈతో పాటు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతికి ముందే వివాహం అయినప్పటికీ తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ భర్తకు దూరంగా ఉంటోంది. ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నడుస్తోంది.