Site icon vidhaatha

Palamuru | నేడు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ప్రారంభం

Palamuru |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది. పలు జిల్లాలకు సాగు, తాగు నీటి కష్టాలు తీర్చాలన్నసదుద్దేశంతో ప్రభుత్వం ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్ కర్నూల్ జిల్లా నార్లపూర్ వద్ద మొదటి పంపు ప్రారంభించి, నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

ఎత్తిపోతల ప్రాజెక్టు వివరాలు

హైదరాబాదుకు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం లక్ష్మీదేవిపల్లి వరకు పంపిస్తారు.

వర్షాకాలంలో వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తి పోయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీశైలం జలాశయం నుంచి ఐదు అంచెల్లో ఎత్తిపోసి, లక్ష్మీదేవిపల్లి జలాశయం వరకు నీటిని పంపిస్తారు. ప్రాజెక్టులో భాగంగా ఆరు లిఫ్టులు నిర్మించారు.

జలాశయాలకు నీరుచేరేందుకు ప్రధాన కాలువల నిర్మాణం పనులు చేపట్టారు. ముందుగా నార్లపూర్ పంపు హౌస్ నుంచి ఎదుల జలాశయం వరకు నీటిని పంప్ చేస్తారు. అక్కడి నుంచి వరుసగా వట్టెం రిజర్వాయర్, కరివేన, లక్ష్మి దేవిపల్లి రిజర్వాయర్లకు నీటిని పంప్ చేస్తారు. ఈ ఒక్కో రిజర్వేయర్ కు ఒక్కో దేవుని పేరు పెట్టారు.

నార్లపూర్ రిజర్వాయర్ (అంజనగిరి):

ఈ రిజర్వాయర్ కు అంజన గిరిగా నామకరణం చేశారు. ఈ రిజర్వాయర్ కట్ట పొడువు 11.02 కిలోమీటర్లు ఉండగా, ఎత్తు 74 మీటర్లు ఉంది. ఇక్కడ నీటి నిలువ సామర్థ్యం 8.41 టీఎంసీలుగా ఉంది. ఇక్కడి నుంచి తొమ్మిది మోటార్ల ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం ఒక్క మోటార్ ప్రారంబభానికి సిద్ధంగా ఉంది. ఈ మోటార్ ను కేసీఆర్ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి నీటిని ఎదుల రిజర్వాయర్ కు తరలిస్తారు.

ఎదుల రిజర్వాయర్ (వీరాంజనేయ):

నార్లపూర్ నుంచి ఎత్తి పోసిన నీటిని ఈ రిజర్వాయర్ కు తరలిస్తారు. ప్రధాన కాలువల ద్వారా నీరు ఇక్కడకు చేరుతుంది. దీని కట్ట పొడవు 12.40 కిలోమీటర్లు ఉండగా, ఎత్తు 38 మీటర్లు ఉంది. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 8.4 టీఎంసీలుగా ఉంది. ఇక్కడకు వచ్చి చేరిన నీరు వట్టెం రిజర్వాయర్ కు చేరుతుంది.

వట్టెం రిజర్వాయర్ (వెంకటాద్రి):

ఈ రిజర్వాయర్ మొత్తం కట్ట పొడవు 15.23 కిలోమీటర్లు కాగా, ఎత్తు 57 మీటర్లు ఉంది. ఈ రిజర్వాయర్ లో 16.74 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది. వట్టెం వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రఖ్యాతి గాంచడంతో ఈ రిజర్వాయర్ కు వెంకటాద్రి అనే నామకారణం చేశారు. ఇక్కడ చేరిన నీరు భూత్పూర్ మండలంలోని కరివేన రిజర్వాయర్ కు చేరుకుంటాయి.

కరివెన రిజర్వాయర్ (కురుమూర్తిరాయడు):

జిల్లాలోని సీసీ కుంట మండల కేంద్రం సమీపంలో ఉన్న కురుమూర్తి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఈ రిజర్వాయర్ కు కురుమూర్తి రాయడు అనే పేరు పెట్టారు. ఈ రిజర్వాయర్ మొత్తం పొడవు 14.12 కిలోమీటర్లు ఉండగా, ఎత్తు 61 మీటర్లు ఉంది. ఈ రిజర్వాయర్ లో 17.35 టీఎంసీ ల నీరు నిలువ ఉంటుంది. ఇక్కడి నుంచి ఉద్ధండాపూర్ రిజర్వాయర్ కు నీరు చేరుతుంది.

ఉద్ధండాపూర్ రిజర్వాయర్:

ఈ రిజర్వాయర్ లో భాగంగా నిర్మించిన కట్ట పొడవు 15.87 కిలోమీటర్లు ఉండగా, ఎత్తు 57.99 మీటర్లు ఉంది. నీటి సామర్థ్యం 16.03 టీఎంసీలు ఉంది. కరివెన నుంచి ఈ రిజర్వాయర్ కు నీరు రావాలంటే కొన్ని ప్రాంతాల్లో సొరంగం ద్వారా పంపిస్తారు. 8.9 కిలోమీటర్ల మేర ఈ సొరంగ మార్గం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

Exit mobile version