- విమానాలను రద్దు చేయడంపై తీవ్ర నిరసన
- ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా
- 10 విమానాలు రద్దు, 50 విమానాలు ఆలస్యం
Delhi Airport | విధాత: తాము వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేశారని ఆరోపిస్తూ అనేక మంది ప్రయాణికులు బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని డియోఘర్‌కు వెళ్లే వారి విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర నిరసన తెలిపారు. బంద్ కరో.. బంద్ కరో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రయాణికులు లాంజ్‌లో గుమిగూడి పెద్దఎత్తున నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10కి పైగా విమానాలను రద్దు చేశారు. మరో 50కి పైగా విమానాలు ఆలస్యంగా సాగాయి. మంగళవారం ఇండిగో సంస్థ ముందస్తు సూచన జారీచేసింది.
ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ, శ్రీనగర్, చండీగఢ్‌లలో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. “దయచేసి విమానాశ్రయానికి బయలుదేరే ముందు మీ విమాన స్థితిని తెలుసుకోండి” అని ఇండిగో సూచించింది. ఇండిగో ప్రయాణికులు తమ ఫ్లైట్ టేకాఫ్ కోసం వేచి ఉండగా రన్‌వేపై భోజనాలుచేసిన ఘటనలో ఇండిగోకు ఈ నెల ప్రారంభంలో ఐదు ఉల్లంఘనలకు రూ.1.2 కోట్ల జరిమానా పడిన సంగతి తెలిసిందే.