TNGOS |
- పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయండి
- నూతన పీఆర్సీని ఏర్పాటు చేయండి
- ఓపీఎస్‌ను అమలు చేయండి
విధాత, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ జీత భత్యాలను ప్రతి నెల మొదటి తారీఖున ఇవ్వాలని టీఎన్జీఓలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేతనాలు మొదటి తేదీన రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ భవన్‌లోని టీఎన్జీఓ భవన్‌లో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రుభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది.
ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సుధీర్ఘంగా చర్చించిన టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరింది. వేతన సవరణ సంఘం(పీఆర్సీ)ని వెంటనే ఏర్పాటు చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్నికోరింది. పీఆర్సీని ఏర్పాటు కు ముందే వెంటనే మధ్యంతర బృతిని ఏర్పాటు చేయాలని కోరింది.
రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి సీపీఎస్ విధానంతో ఉద్యోగ నియామకాలు చేపట్టారని, దీంతో ఈ ఉద్యోగులంతా తమకు వృద్దాప్యంలో దన్ను లేకుండా పోతుందని, ఈ మేరకు పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చే యాలని టీఎన్జీఓ కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల చందాతో కూడిన ఆరోగ్య పథకాన్ని( ఈహచ్ఎస్) ఆలస్యం చేయకుండా అమలు చేయాలని, విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను, నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, ప్రమోషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు పాల్గొన్నారు.
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశ తీర్మానాలు
1) రాష్ట్రంలో 1.7.2023 నుండి అమలు జరిగేలా నూతన పే రివిజన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆలస్యం కాకుండా వెంటనే మధ్యంతర భృతి(ఐ.ఆర్)ని మంజూరు చేయాలి.
2) 1.9.2004 నుండి నియమితులైన ఉద్యోగులకు కాంట్రిబ్యుటరి పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలి.
3). ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం నెలకు రూ.లు 500/- చందాతో ఈ హెచ్ ఎస్ సౌకర్యాన్ని కల్పించే విధంగా వెంటనే ఉత్తర్వులను విడుదల చేయాలి.
4. గచ్చిబౌలిలోని ఇళ్ళ స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవో సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా
ఉన్న ప్రభుత్వ మేమొను రద్దు చేసి వెంటనే BTNGO లకు కేటాయించాలి.
5). రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
6). ఉద్యోగుల, పెన్షనర్ల జీత, భత్యాలను ప్రతి నెల మొదటి తేదీన చెల్లించాలి.
7). టీఎన్జీవో హైదరాబాద్ గచ్చిబౌలి హోసింగ్ సొసైటీ ఫేస్ -II మరియు రంగారెడ్డి హోసింగ్ సొసైటీ యొక్క ఇండ్ల స్థలాల యాజమాన్య హక్కులను సంబంథితా సొసైటీలకు ప్రభుత్వం కలిపిస్తూ వెంటనే ఉత్తుర్వులను విడుదల చేయాలి.
8). వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు 010 ద్వారా జీతాలు చెల్లించాలి.
9). నూతన జిల్లాలకు పాత జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ strength ను మంజూరు చేయాలి.
10). ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలకు ప్రమోషన్ కల్పించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి అన్ని శాఖలలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలి.
11). ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలి
12). పెండింగ్ డి ఏ లను వెంటనే విడుదల చేయాలి.
13). నూతన జిల్లాలు, జోనల్ సిస్టమ్ ఏర్పాటు అయిన సందర్భంలో అన్ని శాఖలకు మరియు కేడర్ లకు సంబంధించి నూతన సర్వీస్ నిబంధనలు ఏర్పాటు చేయాలి…
14). ఆంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకు రావాలి.
15). పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి.
16). 317 జీవో అమలు వల్ల నష్ట పోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి.
17). ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవో సదస్సులు నిర్వహించడానికి తీర్మానించడం జరిగింది.