- ముంబై నుంచి చైనాకు తరలిస్తుండగా
- జేఎన్పీఏ వద్ద పట్టుకున్న డీఆర్‌ఐ
- రూ.2 కోట్ల విలువైన ఈకల స్వాధీనం
విధాత: భారతదేశం నుంచి చైనాకు పెద్దమొత్తంలో నెమలీకలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ముంబై జోనల్ యూనిట్ సుమారు 28 లక్షల నెమలి తోక ఈకలు, 16,000 నెమలి ఈక కాండాలను స్వాధీనం చేసుకున్నది. వీటి విలువ రూ.2.01 కోట్లు ఉంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జెఎన్‌పీఏ) ద్వారా “కొబ్బరిపీచు డోర్ మ్యాట్లు” అని చెప్పి చైనాకు రవాణా చేస్తున్నఎగుమతి కార్గో దాచిన వీటిని పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 110 కింద నెమలీకల సరుకును స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ ఐ అధికారులు తెలిపారు. ఎగుమతిదారు అక్రమ ఎగుమతిలో తన ప్రమేయాన్ని అంగీకరించినట్టు పేర్కొన్నారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించినట్టు వెల్లడించారు. తదుపరి విచారణ జరుగుతున్నదని తెలిపారు. ఇది పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు ఇలాంటి స్మగ్లింగ్ విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. 28 లక్షల నెమలి తోక రవాణా చేస్తున్నారంటే ఆ మేరకు నెమళ్లను చంపి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు.