Site icon vidhaatha

ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త మలుపు.. మెడికో సైఫ్‌కు మద్దతుగా పీజీ విద్యార్థుల నిరసన! సమ్మె నోటీసు

WARANGAL సత్యాన్ని సమాధి చేయొద్దూ.. వాస్తవాలు వెలుగులోకి తీయండి.. ఏకపక్షంగా వ్యవహరించి ఎవరికీ అన్యాయం చేయొద్దంటూ… సీనియర్ పీజీ మెడికో స్టూడెంట్స్ బహిరంగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కేఎంసీ, ఎంజీఎం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా సహచర విద్యార్థి ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో సైఫ్ అనే సీనియర్ పీజీ మెడికోను టార్గెట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నమోదు చేసిన ప్రతి సెక్షన్ పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీనియర్ పీజీ మెడికో సైఫ్ కు మద్దతుగా సీనియర్ జూనియర్ పిజి విద్యార్థులు శనివారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. నిరసన చేపట్టడమే కాకుండా ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కు సమ్మె నోటీసు అందజేశారు. ఎంజీఎం హాస్పిటల్ కు వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

పీజీ సీనియర్ జూనియర్ మెడికోల ధర్నా

‘నో క్యాస్ట్ నో రిలీజియన్’ అంటూ పీజీ సీనియర్ జూనియర్ మెడికోలు ధర్నా నిర్వహించి ప్లకార్ట్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీనియర్, జూనియర్ పీజీ విద్యార్థులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఒకరిని లక్ష్యంగా చేసుకొని మీడియాలో సాగుతున్న దాడి పట్ల అసంతృప్తిని కనబరిచారు. న్యాయం కోసం తాము నిలబడతామంటూ పీజీ సీనియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. చివరికి సమ్మెకు సిద్ధమయ్యారు.

వాస్తవాలు వెలుగులోకి రావాలి

పీజీ మెడకు ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో న్యాయాన్ని విచారించి, వాస్తవాలు వెలుగు లోకి తీసుకురావాలని వారు పదేపదే విన్నవించారు. ప్రీతి కోలుకోవాలని ఆకాంక్షించారు. అసలు ఈ ఘటనలో ‘ఆత్మహత్య’ అనే అంశాన్ని అంగీకరించేందుకు సీనియర్ పీజీతో పాటు, ప్రీతి సహచర విద్యార్థులు కూడా సిద్ధంగా లేకపోవడం ప్రత్యేక అంశం. సీనియర్ జూనియర్ మధ్య డ్యూటీ పరంగా ఉండే సంబంధాలను తప్పుగా ప్రాజెక్ట్ చేయకూడదని విన్నవించారు.

పీజీల సమ్మె నోటీసు

అనంతరం ఎంజీఎం సూపరింటెండెంట్‌కు డాక్టర్ చంద్రశేఖర్‌కు నోటీసు అందజేశారు. ఈ సమ్మెతో రోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నోటీసు నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యల గురించి హాస్పిటల్ హెచ్వోడీసీతో సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలకు నిర్దేశించారు.

కేఎంసీ వద్ద విద్యార్థి సంఘాల నిరసన

ప్రీతి ఆత్మహత్యాయత్నం సంఘటనపై దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో కేఎంసీ మెయిన్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకుగల కారణాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కాలేజీలో జరిగే అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

Exit mobile version