పాలమూరు పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ నే కూనీ చేశారు. ప్రజలకు రక్షణ గా ఉండాల్సిన పోలీసులే ప్రజా భక్షకులుగా మారారు

  • Publish Date - March 28, 2024 / 09:31 AM IST

  • మాజీ మంత్రి కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంటూ ఆరోపణ
  • రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రత్యేక గదిలో ట్యాపింగ్
  • ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్!
  • ఒక్కొరుగా బయటకు వచ్చి జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
  • ఫోన్ ట్యాపింగ్ చేసి విపక్ష నేతలకు చిత్ర హింసలు
  • అప్పట్లో బీ ఆర్ ఎస్ కు బానిసల్లా మారిన కొందరు పోలీసులు
  • ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసుల్లో కొందరు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ నే ఖూనీ చేశారు. ప్రజలకు రక్షణ గా ఉండాల్సిన వారే ప్రజా భక్షకులుగా మారారు. పోలీస్ వ్యవస్థ పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కొందరి వల్ల మంటగలిసింది. పోలీసు శాఖకే మాయని మచ్చ తెచ్చిన ఉదంతంపై ప్రత్యేక కథనం.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసు శాఖను కుదిపేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొందరు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (sib) అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ అనే ఘన కార్యంతో పోలీసు శాఖను నడి బజార్లో నిలబెట్టారు. బీఆర్ఎస్ పెద్దలకు ఊడిగం చేస్తే పదోన్నతులు వస్తాయనే ఆశతో అడ్డదారులకు ఆజ్యం పోశారు.


ఈ అడ్డదారులే కొందరు అధికారులను కటాకటాల వెనక్కి పంపింది. ఈ వ్యవహారం ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాలేదు. ఈ హైదరాబాద్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గాలి పాలమూరు కు సోకింది. పాలమూరు పోలీసులు తామేమీ తక్కువ కాదన్నట్లు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి రూ.కోట్లు దండుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కనుసన్నల్లో పాలమూరు పోలీసుల్లో కొందరు ఈ తతంగానికి తెరలేపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఏకంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన టెక్నికల్ మెటీరియల్ ను సమాకూర్చుకున్నారని తెలుస్తున్నది.


ఇందులో మాజీ మంత్రికి అనుకూలంగా ఉన్న సీఐ, ఎస్సై లు ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రదారులని కొందరు బాధితులు జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికంగా మాజీ మంత్రికి అనుకూలంగా లేని మున్సిపల్ కౌన్సిలర్లు, విపక్ష నేతలపైనే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా వ్యాపారుల ఫోన్ లను ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్య నేతల ఫోన్ సంభాషణను సదరు మంత్రికి చేరవేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.


మాజీ మంత్రికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి సమాచారం తెలుసుకుని అలాంటి వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసారనే ఆరోపణలు ప్రస్తుతం పాలమూరులో హాట్ టాపిక్ గా మారాయి. అప్పటి ఎస్సై లు, సీఐలు మాజీ మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే ఉండడంతో తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

బాధితుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి :


పాలమూరు పోలీసులు చేసిన ఫోన్ ట్యాపింగ్ లో ప్రస్తుత పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా బాధితుడిగా ఉన్నారు.  ఈ విషయాన్ని ఇటీవల ఆయననే స్వయంగా ప్రకటించారు. గత బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి తన ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాను ఎక్కడకు వెళ్ళేది, ఎవరెవరితో మాట్లాడే విషయాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు తెలుసుకుని ఆ విషయాలన్ని సదరు మాజీ మంత్రి కి చేరవేశారని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.


ఫోన్ ట్యాపింగ్ చేసిన అప్పటి పోలీసులపై చర్యలు తెసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరో మున్సిపల్ కౌన్సిలర్ బురుజు సుధాకర్ రెడ్డి గ‌త బుధవారం జిల్లా ఎస్పీని కలిసి రూరల్, టౌన్ పోలీసులు తన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తాను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా ఎన్నికవడంతో తనను బీఆర్ఎస్ లోకి రావాలని అప్పటి మంత్రి ఒత్తిడి తెచ్చారని, తాను ఆయన మాట వినక పోవడంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.


అప్పటి నుంచి పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యని, అక్రమంగా కేసులు పెట్టి తనను మానసికంగా హింసించారని, ఇందుకు అప్పటి ఎస్సై, సీఐలు అని ఆయన ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైందని మరో కాంగ్రెస్ నేత రాఘవేందర్ రాజు అంటున్నారు. అప్పట్లో మాజీ మంత్రి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టులో పోరాడుతున్న రాఘవేందర్ రాజు ఫోన్ అధికంగా ట్యాపింగ్ కు గురైనట్లు ఆయనే స్వయంగా పేర్కొంటున్నారు.


అవసరం నిమిత్తం కోర్టులకు వెళ్లే సమయంలో ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళేవాడినని, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ లకు గురవుతున్నట్లు గ్రహించానని, ముందు జాగ్రత్తగా ఫోన్ లో ఎవ్వరితో కేసు గురించి మాట్లాడేవాడిని కాదని రఘు అంటున్నారు. ఈ విషయం పై అన్ని వివరాలతో కూడిన సమాచారం సిద్ధం చేస్తున్నానని, ఈ వివరాలు రాష్ట్ర డీజీపీ కి అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.అప్పట్లో పాలమూరు పోలీసులు మంత్రి అండతో అరాచకం సృష్టించారని, పోలీసుల బాధితులు చాలా మంది ఉన్నారని, వారంతా బయటకు వచ్చి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తారని తెలుస్తున్నది.


ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతల ఫోన్ లు ట్యాపింగ్ కు గురయ్యాయని, పార్లమెంట్ ఎన్నికల తరువాత వారంత రాష్ట్ర డీజీపీ ని కలిసి ట్యాపింగ్ కు పాల్పడిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని కోరుతామని ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా కొందరు పోలీసులు తొక్కిన అడ్డదారులకు నిజాయితీగా పని చేసే పోలీసులకు కూడా మరకలు అంటుకుంటున్నాయి. అవినీతి కి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు ఉంటేనే నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులకు మరింత గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా బాధితుల ఫిర్యాదు లను ఎస్పీ పరిశీలించి పోలీస్ శాఖ కు మరకలు అంటించిన పోలీసుల పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు అంటున్నారు.

Latest News