Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. హీరాబెన్ మోదీ అంత్యక్రియలను సొంతూరు రయ్‌సన్ గ్రామంలో ఈ ఉదయం నిర్వహించారు. తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఢిల్లీ నుంచి గాంధీనగర్‌కు చేరుకున్నారు. తల్లి పార్థివదేహాన్ని చూసి మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లితో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, కన్నీటి పర్యంతమయ్యారు మోదీ. తన సోదరులతో కలిసి తల్లి పాడెను మోశారు మోదీ.
హీరాబెన్ అంత్యక్రియల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం విజయ్ రూపానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హీరాబెన్.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు యూఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురి కావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. తల్లి ఆస్పత్రిలో చేరగానే, మోదీ నేరుగా అహ్మదాబాద్ వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.